అమెరికాలో నల్ల జాతి కోటీశ్వరుడి భారీ విరాళం

అమెరికాలో నల్ల జాతి కోటీశ్వరుడి భారీ విరాళం

21-05-2019

అమెరికాలో నల్ల జాతి కోటీశ్వరుడి భారీ విరాళం

ఆయనో కోటీశ్వరుడు. కానీ పేదల కష్టాలు తెలుసు. అప్పులు చేసి చదువుకునే విద్యార్థుల బాధలూ తెలుసు. అలాంటి వారిలో కొందరికైనా తనవంతుగా సాయం అందించాలనుకున్నాడు. ఓ ప్రముఖ కాలేజీలోని విద్యార్థుల రుణాలన్నింటినీ తానే తీర్చేయాలని నిర్ణయించుకున్నాడు. అతనే అమెరికాకు చెందిన నల్లజాతి బిలియనీర్‌ రాబర్ట్‌ స్మిత్‌. అట్లాంటాలోని మేర్‌హౌస్‌ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొన్న రాబర్ట్‌ స్మిత్‌ ఆ కాలేజీలో చదువుతున్న 400 మంది విద్యార్థులకు చెందిన దాదాపు 40 లక్షల డాలర్ల(రూ.278 కోట్ల)ను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

ఈ గ్రాంట్‌తో ఇతర ఆఫ్రికన్‌-అమెరికన్ల జీవితాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాని రాబర్ట్‌ తెలిపారు. ఈ వితరణ ఉద్దేశాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో వారు ఇచ్చే స్థానంలో ఉన్నప్పుడు ఎదుటివారికి చేతనైనంత సాయం చేయాలి అని పిలుపునిచ్చారు. కార్నెల్‌, కొలంబియా యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించిన స్మిత్‌ 2000లో విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ అనే సంస్థను ప్రారంభించారు. 2018లో ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 480వ స్థానంలో ఉన్నారు.