ఇవిఎంలపై ఎన్నారై టీడీపి అనుమానం

ఇవిఎంలపై ఎన్నారై టీడీపి అనుమానం

24-05-2019

ఇవిఎంలపై ఎన్నారై టీడీపి అనుమానం

ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఎన్నికల ప్రక్రియపై ఊహాగానాలకు, సవాళ్ళకు తావుండకుండా ఎన్నికలను నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని, విపక్షాలు ఇవిఎంలపై వెలువరిస్తున్న అనుమానాలను తీర్చాల్సిందిపోయి. ఆ ఆరోపణలను పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లే నేడు బిజెపికి, ఇతర రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు వచ్చిన ఫలితాలపై అనుమానాలు కలుగుతోందని ఎన్నారై టీడీపి ఆరోపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభకు జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికలు ఫలితాలు కొన్ని పార్టీలు ఊహించినట్లుగా వచ్చాయని దీని వెనుక ఏదో జరిగి ఉంటుందన్న అనుమానాలు కలుగుతోందని బే ఏరియాలోని ఎన్నారై టీడీపి నాయకులు వెంకట్‌ కోగంటి, సతీష్‌ వేమూరి అన్నారు. ఇవిఎంలను ట్యాంపరింగ్‌ చేయవచ్చని బహిరంగంగా అనుమానాలు వెల్లడైన నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన ఫలితాలు ఒకపార్టీ ఊహించినట్లుగానే రావడం గమనార్హమన్నారు. అందుకే ఆ పార్టీ ఎన్నికలు అయిపోయిన వెంటనే తమదే అధికారమని కూడా ప్రచారం చేసిందని, అందుకే తాము ఇవిఎంలు ట్యాంపరింగ్‌కు గురైనట్లు అనుమానిస్తున్నామని వారు చెప్పారు. ఇదే విషయాన్ని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి కూడా ఫలితాలు వెలువడిన తరువాత చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బిజెపి ఇవిఎంల సహాయంతో ఎన్నికలను హైజాక్‌ చేసిందని ఇవిఎంలను మానుప్యులేట్‌ చేయడం వల్లే తాము ఓటమి పాలయ్యామని మాయావతి చెప్పారన్నారు. ఓటింగ్‌ సమయంలో ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా ఇవిఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారని, ఎవరికి ఓటేసినా, అది బిజెపి గుర్తు కమలానికే వెళ్తుందని ఆరోపించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

తాము టార్గెట్‌ చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లోని ఇవిఎంలు ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా మార్పులు చేసి ఉండవచ్చని అందువల్లనే, బిజెపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు అన్నీ సీట్లను చేజిక్కించుకున్నాయని వెంకట్‌ కోగంటి, సతీష్‌ వేమూరి గట్టిగా చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనే నరేంద్ర మోదీ హవా కొనసాగిందని, అప్పుడు ఇప్పుడు వచ్చినంత సీట్లు కూడా బిజెపికి రాలేదని, ఇప్పుడు మోదీ హవా పెద్దగా లేకపోయినా, చాలాచోట్ల వ్యతిరేకత కనిపించినా, ఫలితాలు మాత్రం బిజెపికి అనుకూలంగా రావడం గమనించాల్సిన విషయమన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిందని, కాని నిన్నవెలువడిన ఫలితాల్లో అక్కడ కూడా అన్నీచోట్లా బిజెపికి ఆధిక్యం రావడం అనుమానించదగ్గ విషయమేనని తెలిపారు.

రాష్ట్రం విషయానికి వస్తే పటిష్టమైన కార్యకర్తలు ఉన్న పార్టీగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీకి కేవలం 24 స్థానాలు మాత్రమే వచ్చాయంటే నమ్మబుద్ధి కావడం లేదని ఇవిఎంలలో మోసం జరగడం వల్లనే టీడిపి ఓడిపోయిందని తాము భావిస్తున్నామని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న అధికారులను కావాలనే ఎన్నికల సంఘం అత్యున్నతస్థాయిలో నియమించిందని, వారంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలురని కూడా వార్తలు వచ్చాయని, అలాగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు కోరినట్లుగానే అధికారులను ఎన్నికల సంఘం బదలీ చేసిందని, ఇలా చేయడం వంటివి చూసినప్పుడు ఎన్నికల నిర్వహణ, ఇవిఎంల భద్రత విషయంలో తమకు అనుమానాలు కలుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కూడా వైసిపీ కోరిందని చాలారోజుల తరువాత ఫలితాల వెల్లడికి ముందు చంద్రగిరిలో రీపోలింగ్‌ జరిపిందని ఇలాంటి విషయాలన్నింటిని గమనిస్తే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా భారీగానే కుట్రజరిగినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఏదీ ఏమైనా ఈ ఎన్నికల నిర్వహణలో విపక్షాల అనుమానాలు నిజమయ్యేలా ఫలితాలు రావడం దురదృష్టకరమని వెంకట్‌ కోగంటి, సతీష్‌ వేమూరి వాపోయారు.