ఆచార్యదేవోభవః - వాసిలి శ్యాం సుందర్

ఆచార్యదేవోభవః - వాసిలి శ్యాం సుందర్

24-05-2019

ఆచార్యదేవోభవః  - వాసిలి శ్యాం సుందర్

భగవంతునికి భక్తునికి గల సంబంధంలాగే, గురువుకి శిష్యుడికి గల సంబంధానికి ఒక  అవినాభావ సంబంధం వుంది. భక్తుడికి భగవంతునిమీద ఎంతఅచంచలమైన  నమ్మకంవుంటుందో శిష్యుడికి గురువుమీద కూడా అంతే అచంచలమైన నమ్మకంవుంటుంది. 

గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

ఈ శ్లోకం గురుస్తోత్రంలో మొదటిశ్లోకం. ఈ శ్లోకం మనం నిత్యజీవితంలో తరచు వింటూవుంటాం. దీని అర్ధం ఏమిటంటే 'గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. గురువే భగవంతునికి ప్రతిరూపం. ఆ గురువుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను'

అసలు గురువు ఆంటే ఎవరు? ఎవరిని గురువు అని పిలవ వచ్చు? అసలు గురువుని భగవంతునిగా చూడాలంటే గురువుకు కావలసిన అర్హతలేమిటి? అందరు గురువులను భగవంతునిలాగా చూడగలమా ?

గురువు ఆంటే జ్ఞానవంతుడు, తెలివిమంతుడు, నిరాడంబరుడు, క్రమశిక్షణ కలిగినవాడు, నిజాయితీ గలవాడు, దయ, జాలి గలవాడు, పరిపూర్ణత పొందినవాడు, శిష్యుని ఎదుగుదల తప్ప లాభాపేక్ష లేనివాడు వంటి లక్షణాలు గలిగినవాడై ఉండాలి. వాడుకలో మనం మాములుగా  మనకు తెలియని విషయాలను మనకు అభ్యసించేవారిని గురువులు అంటాము. అది మనకు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, వృత్తివిద్యల్లో నేర్పించే అధ్యాపకులు గావచ్చు, లలిత కళలు నేర్పించేవారు కావచ్చు, క్రీడలు నేర్పించేవారు కావచ్చు, ఇలాఎవరైనా కావచ్చు వారిని గురు పరంపరగా పరిగణిస్తాం.  కానీ పూర్వకాలంలో వీరిని గురువులుగా గుర్తింపబడలేదు. 

హిందూమత ప్రామాణిక గ్రంధాల్లో గురువును ఆధ్యాత్మిక విషయాలను బోధించేవారుగా గుర్తించారు. పూర్వకాలంలో మనకు గురుకులాలు ఉండేవి.  అందులో ఎవరైనా విద్యనభ్యసించాలంటే మొదట గురువు పెట్టేపరీక్షల్లో నెగ్గి, గురువుకి నమ్మకం కలిగించాలి. ఆ పరీక్షలు విద్యకు సంబంధిచినవే కానక్కరలేదు. ఒక వేళ పరీక్షలో ఉత్తీర్ణుడై తరువాత శిష్యుని ప్రవర్తనలోగాని, పద్దతుల్లోగాని, విద్యనభ్యసించే విధానంలోగానీ, ఏ స్థితిలోనైనాగానీ, పరిస్థితిలోనైనాగానీ  సంతృప్తికరంగా లేకపోతే శిష్యుని తిరస్కరించవచ్చు.  ఒకసారి  ఇద్దరు విద్యార్థులు విద్యనభ్యసించడానికై   ఒక గురుకులానికి వెళ్తారు.  కొన్నిరోజుల విద్యాభ్యాసం తర్వాత గురువుగారు వారికి నిజంగా విద్యనభ్యసించడంలో ఆసక్తి వుందో లేదో తెలుసుకోవడానికై ఒక పరీక్ష పెడతారు. వారి ఇద్దరికీ భోజనంలో ఉప్పు లేకుండా వడ్డించమంటారు. భోజనం చేసిన తర్వాత మొదటి విద్యార్థి గురువు గారితో భోజనంలో ఉప్పులేదని ఫిర్యాదు చేస్తాడు. రెండవ విద్యార్థి ఆ విషయం అసలు పట్టించుకోకుండా తన దినచర్యలో నిమగ్నమై ఉంటాడు. గురువుని దేనికయితే ఆశ్రయించాడో అది కాక  మొదటివిద్యార్థి ఆసక్తి ఇతరత్రా విషయాలమీద చూపడంతో గురుకులం నుంచి ఆ విద్యార్థిని పంపివేస్తాడు.

ఎవరి సమక్షంలో మనకు  మనఅంతరంగంలో, మన హృదయంలో  ఒక మెరుపు లేక స్పందన లేక అపూర్వ అనుభూతి  కలుగుతుందో, ఎవరి సమక్షంలో మనం జీవితమంటే ఈ ప్రాపంచిక సుఖాలకే పరిమితంకాదు, దీన్ని  మించింది ఇంకావుంది అని గ్రహిస్తామో, వారే మన గురువుగా గుర్తించాలి.  గురు శిష్యుల బంధం చాలా విచిత్రమైంది, అపూర్వమైంది. అది ఎవరికీ అర్ధం కాదు.  మనం మనల్ని మరిచి పోయి గురువులో ఐక్యం కాగలగాలి. మనల్ని మనం సమర్పించుకోగలగాలి.  మన ఉనికికి  ప్రత్యేక అర్ధం లేదు అనే భావనకు రాగలగాలి. గురువుని ఒక అతీంద్రశక్తిగా గుర్తించాలి. గురువుని చూస్తే తాదాత్మయం చెందగలగాలి.   మనం గురువుని ఒక వ్యక్తిగా చూసినప్పుడు మాటల అవసరం ఉంటుంది. అదే గురువును ఒక అతీంద్రశక్తిగా భావించినప్పుడు మాటల అవసరం ఉండదు. అప్పుడు గురువు సమక్షంలో వున్నా,  దూరంగా వున్నా, గురువు యొక్క నామ స్మరణతో గురువుతో సంభాషణ జరుగుతుంది. మాటల అవసరం ఉండదు. మౌనమే మాట్లాడుతుంది. మనం ఆస్తితికి చేరినప్పుడు ఒక సారి కళ్ళుమూసుకొని గురునామ స్మరణం చేస్తే అంతర్ముఖంగా మనం గురువు చెంతవుంటాం. మనకి ఏమైనా సమస్యలు వచ్చినా మనకు గురువు నుంచి ప్రత్యక్షంగా లేక పరోక్షముగా వచ్చే సంకేతాల ద్వారా అవి సమసిపోతాయి.  

మనకు ఆధ్యాత్మిక జీవితంలో లేక ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చే సమస్యలను పరిష్కరించేవారే ఈ గురువులు. మన ఎదుగుదలని బట్టి మనకు వచ్చే సమస్యలు, మన ఎదుగుదల సమీక్షించి మన మార్గం సుగమం చేసేవారే గురువులు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనను పరమాత్మతో అనుసంధానపరచే వ్యక్తే గురువు. గురువు యొక్క ప్రాముఖ్యత తెలిపే ఒక సంఘటన చూద్దాం. రామాయణంలో సుతీక్షణుడు అనే భక్తుడు భరద్వాజ మహర్షి దగ్గర శిష్యరికం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు అతను పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు, భరద్వాజ మహర్షి పర్ణశాలలో గుమ్మందగ్గర దర్శనమిస్తారు. ఎవరికి ముందుగా నమస్కరించాలి   దేవుడికా లేక గురువుకా అని సందిగ్ధంలో ఒక్కక్షణం అలోచించి, ముందు భరద్వాజ మహర్షికి   నమస్కరించి శ్రీరామచంద్రుడుకి తర్వాత నమస్కరిస్తాడు.  తన గురువు ద్వారానే   నకు  దర్శన భాగ్యం కలిగింది కాబట్టి గురువుకే ప్రాముఖ్యత నిస్తాడు.

ఈ కోవకు చెంది, మానవాళిని ఉద్ధరించిన వారిలో గురునానక్, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, పరమహంస యోగానంద, మహేష్ యోగి, లాహిరి మహాశయా, స్వామి ప్రభుపాద మొదలైనవారు. వీరు జీవించిన సమయంలో వీరి ప్రభోదలు, ఆశయాలు ఎంతోమందిని ప్రభావితం చేసాయి. వీరిదైన ప్రతేకముద్ర మానవాళిమీద మిగిల్చి వెళ్లారు.

మారుతున్న కాలంతో, విభిన్న  అభిరుచులతో, ఈ అతివేగమంతమైన జీవనశైలిలో ఈ తరం దృక్పధం మారింది. దీనికి అనుగుణంగా యోగుల దృక్పధం కూడా మారింది. కొన్ని దశాబ్దాల పూర్వపు పద్ధతులు, ఆలోచనలు ఈ తరం వారు అనుకరించే రీతిలో లేవు. ఆ కాలంలో పుట్టినకొందరు ఇంకా ఆ పద్ధతులకు,  భావాలకు, ఆశయాలకు విలువ నిచ్చినా, ప్రస్తుతం యువత పూర్తిగా భిన్న పద్దతిలో ముందుకు వెడుతోంది. ఇప్పుడు గురుశిష్య సంబంధంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గురువు చెప్పేది ఇప్పటి శిష్యులు గుడ్డిగా నమ్మడం లేదు. ప్రతిదానికి వారికి వివరణ ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రుజువు చేయవలసి వస్తోంది. లేకుంటే తృప్తి చెందరు. ఇప్పుడు గురుశిష్య సంబంధంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోంది. డబ్బుతో పాటు శిష్యుని హోదా, స్థాయిలని గూడా పరిగణలోకి తీసుకొంటున్నారు. శిష్యులు గూడా గురువు హోదా, స్థాయిలను చూసుకొనే గురువుగా అంగీకరిస్తున్నారు. ఆశ్రమాల్లో శిష్యునికి పెద్దహోదావుంటే అతనికి లభించే సౌలభ్యాలు కూడా పెద్దస్థాయిలో ఉంటాయి. నేటి ఆశ్రమాలు కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ స్థాయిలో అన్ని హంగులతో వుండి ఆక్కట్టుకుంటున్నాయి. ఒక పేదవాడు నిజాయితీగా ఏదయినా ఆశ్రమాన్ని ఆశ్రయిస్తే అతనికి అనుమతి కూడా  దొరకదు, కనీసం అతనివైపు గురువు కన్నెత్తి చూడనుకూడా చూడడు.  

ఈ ప్రక్రియలో అసలు నేటి యువత ఏమి కోరుకుంటోంది  ఆంటే, దానిగురించి యువతకు  ఆలోచించే సమయం గాని ఆసక్తి గాని లేదనే చెప్పాలి. కానీ ఎదో కోల్పోతున్నాం అని తెలుస్తూవున్నాదానిమీద ధ్యాస పెట్టారు. పారంపర్యంగా కొన్ని ముందుతరం నుండి సంక్రమించినవి లేదా నేర్చుకున్నవి వున్నా ప్రామాణికంగా ముందుతరంవారికి వున్నా భక్తి శ్రద్ధలు గాని ఆసక్తి గానీ తరువాతితరంలో ఉండట్లేదు అనే చెప్పాలి. కొంతమంది  ఇవి వయస్సు మీరినవారికి గాని మాకు దాని  అవసరంలేదు అని అనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధిక ఒత్తిడ్లకి గురయినవారు, ఒత్తిడ్లను తట్టుకోలేనివారు,  వారికి అనువయిన ఆశ్రమాలను, గురువులను ఆశ్రయిస్తున్నారు. 

ఈ కంప్యూటర్ల యుగంలో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఉద్యోగనిమిత్తం వేరే రాష్ట్రాల్లో లేదా దేశాల్లో  కుటుంబాల ఏర్పాటు చేసుకొని, ఆదాయానికి మించిన  వ్యయంతో, ఆర్భాటపు జీవనశైలితో, అధికవ్యాపకాలతో, క్రమశిక్షణ లేని జీవనశైలితో , ఉద్యోగ వత్తిడ్లతో   జీవితాలను  అసంతృప్తి, అలజడి, మనోవ్యాకులత, శారీరక, మానసిక రుగ్మతలకు గురిచేసుకొంటున్నారు.  ఈ నేపథ్యంలో అలసి సొలసి వున్న జీవితాలకు ఖచ్చితంగా స్వాంతన అవసరం.  దానికి  వారు కుటుంబసభ్యులతో ప్రతిరోజూ కొంతసమయం గడపడం,  తలితండ్రులతో, బంధు మిత్రులతో  సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, వారిఇళ్లకు రాకపోకలు, దైవ చింతన, ప్రవచనాలు వినడం, ప్రతివారం దేవాలయాలు, ఆశ్రమాలు దర్శించడం, కొంత స్వచ్చంద సేవలు చేయడం లాంటివి చేయడం వలన లాభాపేక్ష, ప్రతిఫలాపేక్ష పోయి సేవాగుణం పెరిగి మనసులో అలజడి, ఒత్తిడి తగ్గి జీవనంలో పరిపూర్ణత రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత తరంలో ఈ ఒత్తిళ్లతో కూడిన యాంత్రిక జీవనానికి ఊరటనిచ్చి మనల్ని తిరిగి మాములు స్థితికి తేగల వారెవరైనా వుంటే వారు గురువుల కోవలోకే వస్తారు. వారు కేవలం ఆశ్రమాధిపతులో, మఠాధిపతులో, పీఠాధిపతులో కాన్నకరలేదు. మన ఈ అలసిపోయిన యాంత్రిక జీవనంలో ఎవరి సమక్షంలో మనం సేద తీర్చుకొని, వారి మధురమైన సందేశంతో వుత్తేజులం అవుతామో, ఎవరు  మన వెంటవుండి మనల్ని ఒడిదుడుకులనుండి, సమస్యలనుండి గమ్యానికి చేర్చగలరో వారే మనకు నిజమైన గురువులు. ప్రతిమనిషిలోనూ కనపడని ఒకగురువు ఉంటాడు. ఉదాహరణకి, ఒక అనుకోని సంఘటనలో  ఎవరో ఒకవ్యక్తి మనజీవితంలోకి అకస్మాత్తుగా ప్రవేశించాడు అనుకుందాం.   అతని సలహావలన మనని  తొలుస్తున్న ఒక దీర్ఘ కాలపు సమస్యకి పరిష్కారం దొరకవచ్చు, మనకు పరోక్షంగా అతని సూచన లేదా సలహా వలన జీవితంలో అనుకోని మలుపు తిరగవచ్చు. అతనిని మనం గురువుగా గుర్తించాలి.   

ఏది ఏమైనా గురువు అన్నవాడు దారిచూపగలడు లేదా దారి సుగమం చేయగలడు గానీ, ఆ దారిలో ప్రయాణం చేయవలసింది, ఒడిదుడుకులని ఎదుర్కోవలసింది శిష్యుడే కదా! మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దాని బాధ్యత గూడా మనదే కదా!

Syam Sunder Vasili
Cell: 91 9849033460
Spiritual Foundation, Inc
7062 South Beringer Drive
Cordova, Tennessee 38018