నెల నెలా తెలుగు వెన్నెల 143 వ సాహిత్య సదస్సు

నెల నెలా తెలుగు వెన్నెల 143 వ సాహిత్య సదస్సు

17-06-2019

నెల నెలా తెలుగు వెన్నెల 143 వ సాహిత్య సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు "నెల నెలా తెలుగు వెన్నెల" 143 వ సాహిత్య సదస్సు ఆదివారం, జూన్16 వ తేదీ న సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 143 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేసారు.

కార్యక్రమంలో ముందుగా చిన్నారులు రేణుశ్రీ బుస, ఉదయ్ వోమరవల్లి, వేముల సాహితి, వేముల సింధూర ప్రార్ధనా గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. డా. ఊరిమిండి నరసింహారెడ్డి మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. డా.RVSS ప్రసాద్ గారు వేమన పద్యాలు -సామాజిక స్పృహ అనే అంశం మీద మాట్లాడుతూ, పద్య వైభవాన్ని కొన్ని వేమన పద్యాలని చదివి వివరించారు.

మానవత అమర్ నాథ్ రెడ్డి తరిమెల సమాజంలో రక్త దానం ప్రాధాన్యత గురించి వివరించడమే కాకుండా వారు దేశ విదేశాల నుండి పుట్టపర్తి హాస్పిటల్ కి వచ్చే రోగులకి తమ సంస్థ మానవత ద్వారా రక్త దానం చేసి ముఖ్యంగా పేదవారిని ఆదుకుంటామని చెప్పారు.  

డా. పూదూర్ జగదీశ్వరన్ గారు ఆముక్తమాల్యద లోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు.

వేముల లెనిన్ గారు వాగ్భూషణ భూషణుడు ఏనుగు లక్ష్మణ కవి అనే అంశం పై మాట్లాడారు.

ముఖ్య అతిథి శ్రీమతి గీతాంజలి గారు  సమకాలీన కథ ఎలా ఉండాలి, మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, కథకి నవల కి గల వ్యత్యాసాలు, కథలోని పాత్రలు, శిల్పం, కథకి సంబంధించి విమర్శకుని పాత్ర, కథకుడు విమర్శలని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలని వివరించారు.

ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు, సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి శరత్ యర్రం, సాహిత్య కమిటీ సభ్యులు సతీష్ బండారు, పూర్వాధ్యక్షులు డా.ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డా.తోటకూర ప్రసాద్, భాను ఇవటూరి, లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చిన్నారులు సింధూర వేముల, సాహితీ వేముల, చిన్నారులు రేణుశ్రీ బుస, ఉదయ్ వోమరవల్లి, సురేష్ కాజ, చంద్రహాస మద్దుకూరి, ఆచార్య జగదీశ్వరన్ పూదూరి, సి.ఆర్ .రావ్, డా .RVSS ప్రసాద్, తరుణ్, స్వాతి కృష్ణ మూర్తి, సాజి గోపాల్ తదితరులు హాజరయ్యారు.

సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష తెలుగు మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.    

శ్రీమతి గీతాంజలి గారిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పాలకమండలి సభ్యులు జ్ఞాపికని ఇచ్చి ఘనంగా సత్కరించారు. మీడియా మిత్రులకి కృతఙ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.

Click here for Event Gallery