అక్రమ వలసదారులకు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

అక్రమ వలసదారులకు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

19-06-2019

అక్రమ వలసదారులకు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. వచ్చే వారమే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వలసదారుల్ని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకం చేసేందుకే గ్వాటెమాలా అంగీకరించిందన్నారు. అక్రమ మార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ (ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు అని ట్వీట్‌ చేశారు. తమ దేశం మీదుగా అమెరికాలో ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై త్వరలోనే గ్యాటెమాలా సంతకం చేయనుంది. ఆ వలసదారులు ఆశ్రయం కోసం ఇకపై అమెరికాకు బదులు గ్యాటెమాలాలోనే దరఖాస్తు చేసుకుంటారు అని ట్రంప్‌ పేర్కొన్నారు.

మధ్య అమెరికాలో దేశాల్లో అశాంతి కారణంగా అక్కడి ప్రజలు గ్యాటెమాలాకు, మెక్సికోకు అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నార. ఈ నేపథ్యంలోనే ఇటీవల సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6 వేల మంది గార్డులను నియమించింది. దీంతోపాటు తమ దేశం గుండా ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు కూడా అంగీకరించింది. అమెరికా, గ్యాటెమాల త్వరలో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోనున్నాయి. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 10 లక్షల మందిని వెనక్కి పంపించేయాలన్న కోర్టుల ఉత్తర్వుల్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.