సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు అమెరికాలో భారీ వేతనానికి కొలువును సొంతం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురానికి (వెంకటకృష్ణా రాయపురం) చెందిన తపాలా శాఖాధికారి ఇంటి సుబ్బారావు, సూర్యకుమారి దంపతుల రెండో కుమారుడు ఇంటి దుర్గాలక్ష్మీ నారాయణస్వామి(దిలీప్) యాపిల్ సంస్థలో వార్షిక వేత్తనం రూ.2 కోట్లకు కొలువు సాధించారు. ఈ యువకుడు పదో తరగతిలో 556 (600) మార్కులతో, ఇంటర్మీడియట్లో 980 (1000) మార్కులతో ప్రతిభను కనబరిచారు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదారాబాద్‌లో ఓ సంస్థలో ఉద్యోగం చేశారు. క్యాట్‌లో 99.3 స్కోర్ సాధించి అమెరికాలోని వర్జినియా టెక్‌లో ఎంఎస్ చదివేందుకు (2015-17) ఎంపికయ్యారు. ఈ మధ్యే ఎంఎస్‌ను పూర్తి చేశారు. ఈలోపే కాలిఫోర్నియాలోని ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మూడు రోజులపాటు జరిగిన ముఖాముఖిలో విజయం సాధించి ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నారు.. ఏడాదికి 2,85,000 డాలర్ల (సుమారు రూ.2 కోట్లు) వేతనం చెల్లించేందుకు ఆపిల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ నెల 22న సంస్థలో విధుల్లో చేరనున్నారు.