రామ్‌మాధవ్‌కు ఘనస్వాగతంతో పెద్దపీట వేసిన తానా

TANA Grand Welcome to BJP General Secretary Ram Madhav

ఆయనకు అవమానం జరగలేదని వేమన, డా.మూల్పూరి వివరణ

వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించిన 22వ తానా మహాసభల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్‌కు అవమానం జరిగిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఆయనకు తానా ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలతో అమెరికా రాజధాని నగరంలో ఘనస్వాగతం పలికి ఆయనకు ప్రధాన వేదికపై ప్రముఖ స్థానం కల్పించామని తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావులు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

22వ తానా సభలకు అన్ని రాజకీయ పార్టీల నుండి ప్రజాప్రతినిధులను ఆహ్వానించామని అందరికీ సమున్నత రీతిలో సమాదరణ కల్పించామని వారు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, భాజపా నుండి రామ్‌మాధవ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ సీ.ఎం.రమేష్‌, వైకాపా నుండి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు, ఆంధ్ర ప్రదేశ్ శాశనసభ విప్ కోరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తెదేపా నుండి ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, తెలంగాణా శాశనసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రసమయి బాలకిషన్ తదితరులు హాజరయ్యారని ఈ సభల్లో వారి గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఆదరించామని వీరు తెలిపారు.

రామ్‌మాధవ్ ప్రసంగానికి 15నిముషాలు కేటాయించగా ఆయన 12నిముషాల ప్రసంగం అనంతరం తానా సభలకు వచ్చిన వెనుక చివరి వరుసలోని అతిథులు కొందరు అడ్డుతగిలారని, ముందు వరుసలో ఉన్న తానా కార్యవర్గ సభ్యులు గానీ, ప్రతినిధులు గానీ, విరాళాలు అందించిన దాతలు గానీ రామ్‌మాధవ్ ప్రసంగానికి అడ్డుచెప్పలేదని పేర్కొన్నారు. 20వేల మంది ప్రవాస అతిథులు సభలో నిండుగా ఉన్నప్పుడు రామ్‌మాధవ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారని, అలంటి సందర్భంలో ఎవరో వెనుక వరుసలోని వారు వేసిన కేకలు రామ్‌మాధవ్‌ను ఉద్దేశించినవి కావని, ఆయనను తానా సంస్థ అపారంగా గౌరవిస్తోందని వేమన సతీష్, వెంకటరావులు తెలిపారు.

రామ్‌మాధవ్‌ను ప్రసంగం అనంతరం ఘనంగా సన్మానించామని, దేశంలోనే శక్తిమంతులయిన తెలుగువారిలో ఒకడిగా సభకు పరిచయం చేశామని ఆయన తిరుగుప్రయాణంలో విమానాశ్రయానికి వెళ్లబోయే ముందు కూడా సభలోని ఏర్పాట్ల పట్ల హర్షం వెలిబుచ్చారని తెలిపారు. తానా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను, కవులను, కళాకారులను, ప్రతిభావంతులను సమరీతిలో గౌరవిస్తుందని రామ్‌మాధవ్‌ను సంస్థ అవమానించిందనేది వాస్తవ విరుద్ధమని, అలాంటి వార్తలను తాము ఖండిస్తున్నామని వీరు వెల్లడించారు.

 


                    Advertise with us !!!