మరో వివాదంలో డొనాల్డ్‌ ట్రంప్‌
Nela Ticket
Kizen
APEDB

మరో వివాదంలో డొనాల్డ్‌ ట్రంప్‌

18-05-2017

మరో వివాదంలో డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. మాజీ జాతీయ భద్రత సలహాదారుడు మైక్‌ ఫ్లిన్‌కు రష్యాతో ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ జరుపుతున్న విచారణను ఆపివేయాలని, ఆ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న జేమ్స్‌ కోమీని ట్రంప్‌ కోరినట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఫ్లిన్‌ మంచివారు. మీరు దీన్ని ఇంతటితో వదిలేయవచ్చని ఆశిస్తున్నా అని ట్రంప్‌ తనతో వ్యాఖ్యానించినట్లు కోమీ మెమోల్లో పేర్కొన్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ వార్త ప్రచురించింది. ఫ్లిన్‌ రాజీనామా చేసిన మరుసటి రోజు (ఫిబ్రవరి 14)న ఈ మేరకు ట్రంప్‌తో జరిగిన సంభాషణ వివరాలు కోమీ రికార్డుల్లో నమోదు చేసినట్లు పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణకు నేతృత్వం వహిస్తున్న కోమీని, ఇటీవల ట్రంప్‌ అర్ధంతరంగా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇటు అత్యంత రహస్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి, రాయబారులతో ట్రంప్‌ పంచుకున్నారని కూడా తాజాగా ఆరోపణలు వచ్చాయి. రష్యాతో ట్రంప్‌ సంబంధాలపై వస్తున్న ఆరోపణలన్నింటిపై విచారణ జరగాలని ప్రతిపక్షాలు  డిమాండ్‌ చేశారు.