వచ్చే నెల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా నిర్వహించ తలపెట్టిన భారీ కార్యక్రమానికి ప్రవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి 40వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో పది వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తులు ప్రారంభమైన తొలి రెండు వారాల్లోనే 39వేల మంది తమ ఆసక్తిని తెలియజేసినట్లు తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్న హ్యూస్టన్లో హౌదీ మోదీ పేరిట ఈ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే.
ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్లనున్న మోదీ సెప్టెంబరు 22న అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ఈ సభ జరగనుంది. భారతీయ అమెరికన్ సోదరులను పెద్ద ఎత్తున ఒక చోట కలిపే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం భారతీయతను ప్రతిబింబిస్తుంది. సభకు హాజరయ్యేవారికి ఇబ్బంది కలగకుండా హ్యూస్టన్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి 300 బస్సులు ఏర్పాటు చేయనున్నాం అని కార్యక్రమ నిర్వహక కమిటీ కన్వీనర్ జుగల్ మలానీ తెలిపారు.