నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు అతిరథమహారథులు
Ramakrishna

నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు అతిరథమహారథులు

22-05-2017

నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు అతిరథమహారథులు

తరలివస్తున్న సినీ తారలు, ప్రముఖులు, మేధావులు, ఆధ్యాత్మిక వాదులు

అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరమ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే తెలుగు సంబరాలకు ఈ సారి చికాగో వేదికగా మారింది. తెలుగునేల నుంచి అతిరథ మహారథులు ఈ సారి జూన్ 30 నుండి జూలై 2 వరకు చికాగోలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేస్తున్నారు.  భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి  లావు నాగేశ్వరరావు, భారత పౌర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతి రాజు లను నాట్స్ తెలుగుసంబరాలకు ఆహ్వానించింది. వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. వీరితో పాటు  ఏపీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలిబుద్ధప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీ, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్  తదితర ప్రముఖులు ఈ సంబరాలకు విచ్చేస్తున్నారని నాట్స్ తెలిపింది.  

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా అనేక సినీ, సాంస్కృతిక కార్యక్రమాలను నాట్స్ ఏర్పాటు చేసింది. తెలుగు సంబరాల్లో మేముసైతమంటూ పలువురు సినీ ప్రముఖులు ఈ సంబరాలకు విచ్చేస్తున్నారు. వారంతా సంబరాలకు వచ్చే తెలుగువారితో  తమ సంతోషాలను పంచుకున్నారు. జబర్థస్త్ కామెడీ టీం కూడా సంబరాల్లో నవ్వులపువ్వులతో  అలరించేందుకు సిద్ధమైంది.  ఇక ప్రముఖ ఇండియన్ ఐడల్ రేవంత్ తో పాటు వందేమాతరం శ్రీనివాస్, పలువురు గాయనీ గాయకులు సంబరాల్లో తమ పాటలతో హోరెత్తించనున్నారు.

మరో వైపు వసుదైక కుటుంబం పేరుతో ఆధ్యాత్మిక సదస్సు కూడా జరగనుంది. ఈ సదస్సులో ప్రముఖ ఆధ్యాత్మిక విశ్వయోగి విశ్వంజీ తో పాటు పలువురు ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొననున్నారు. ఇక తెలుగుభాషా సాహిత్యంపై కూడా తెలుగు సంబరాల్లో చర్చలు జరగనున్నాయి. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణితో పాటు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తదితరులు సాహితీ సంబరాల్లో పాలుపంచుకోనున్నారు. సంబరాలకు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన వారు వెంటనే సంబరాలు డాట్ ఓఆర్జీ లో లాగిన్ కావాలని నాట్స్ తెలిపింది.