ఇర్వింగ్ లో ఘనంగా జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

ఇర్వింగ్ లో ఘనంగా జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

09-10-2019

ఇర్వింగ్ లో ఘనంగా జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌(ఎంజీఎంఎన్‌టీ) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 6న ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ ప్లాజా(1201 హిడెన్‌ రిడ్జ్‌ డ్రైవ్‌, ఇర్వింగ్‌, టెక్సాస్‌) వద్ద మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌తో పాటు ఇర్వింగ్‌ పట్టణ మేయర్‌ రిక్‌ స్టాప్ఫేర్‌, టెక్సాస్‌ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్‌, డిప్యూటీ కాన్సల్‌ జనరల్‌ అఫ్‌ ఇండియా సురేంద్ర అదానా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో కార్తికేయ చావాలి, అభిరామ్‌ తదేపల్లి గాంధీకి ఎంతో ఇష్టమైన భజన 'వైష్ణవ జనతో'ను అలపించారు. ఎంజిఎంఎన్‌టీ కార్యదర్శి రావు కల్వలా అతిథులను, ప్రేక్షకులను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎంజీఎంఎన్‌టీ చైర్మన్‌ డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ... గాంధీ తత్వశాస్త్రం, సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా శాశ్వతంగా ఉంటాయని పేర్కొన్నారు. 12 దేశాలలో పౌర హక్కుల ఉద్యమాలకు గాంధీ స్ఫూర్తిదాయకం అన్నారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, నెల్సన్‌ మండేలా వంటి ప్రపంచ నేతలతో పాటు మరెంతో మంది తమ లక్ష్యాలను సాధించడానికి గాంధీ మార్గాన్ని అనుసరించారని గుర్తు చేశారు. గాంధీ ప్రపంచంలో శాంతికి చిహ్నంగా నిలిచారని చెప్పారు. గవర్నర్‌ అబ్బాట్‌ తన ప్రసంగంలో భారత్‌, టెక్సాస్‌ మధ్య శాశ్వత బంధం గురించి వివరించారు. ఆధునిక ప్రపంచంలో మహాత్మా గాంధీ శాంతి బోధల యొక్క ప్రాముఖ్యతను  ప్రస్తావించారు. ఇండియా, టెక్సాస్‌ మరియు భారతీయ-అమెరికన్‌ కమ్యూనిటీల మధ్య బంధం కుటుంబం, సమాజం, స్వేచ్ఛ మన భాగస్వామ్య విలువలలో లోతుగా పాతుకుపోయిందన్నారు.

డిప్యూటీ కాన్సల్‌ జనరల్‌ అఫ్‌ ఇండియా సురేంద్ర అదానా డీఎఫ్‌డబ్ల్యూ ఇండియన్‌-అమెరికన్‌ కమ్యూనిటీ కీలక పాత్రను ప్రశంసించారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌(ఐఏఎన్‌టీ) అధ్వర్యంలో ''గాంధి శాంతి యాత్ర''లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా శాంతికి సంకేతంగా 15 తెల్ల పావురాలను గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌తో పాటు గాంధీ మెమోరియల్‌ బోర్డు సభ్యులు గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ఎంజీఎంఎన్‌టీ సభ్యులు టి షర్ట్స్‌, కేప్స్‌ అందజేశారు. అలాగే కార్యక్రమం ముగిసిన అనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరికీ బ్రేక్‌ ఫాస్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్‌ బోర్డు సభ్యులు: డా. ప్రసాద్‌ తోటకూర, బీఎన్‌ రావు, జాన్‌ హామేండ్‌, రావు కల్వాల, టయాబ్‌ కుండావాల, పియూష్‌ పటేల్‌, అక్రం సయెద్‌, కమల్‌ కౌశిల్‌, అభిజిత్‌ రాయల్కర్‌ మరియు ఆహ్వాన కమిటీ సభ్యులు: మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్‌ దాసరి, డా. సత్‌ గుప్తా, శ్రీకాంత్‌ పోలవరపు, శ్రీధర్‌ తుమ్మల, షబ్నం మోడ్గిల్‌, గుత్తా వెంకట్‌, రాజేంద్ర వంక్వాలాలతో పాటు ఐఏఎన్‌టీ, ఐఏఎఫ్‌సీ బోర్డ్‌ డైరెక్టర్స్‌ ముఖ్య అతిథి, ప్రత్యేక అతిధులను ఘనంగా సత్కరించారు.

Click here for Event Gallery