బ్లాక్‌చైన్‌తో అద్భుత ఫలితాలు

బ్లాక్‌చైన్‌తో అద్భుత ఫలితాలు

19-11-2019

బ్లాక్‌చైన్‌తో అద్భుత ఫలితాలు

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ సృష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో ఈ టెక్నాలజీ వినియోగాన్ని పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆ దిశగా చర్యలు తీసుకొంటున్నదని వివరించారు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై ఆయన హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో 6వ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ఐదురోజులపాటు జరిగే ఈ సదస్సులో 56 దేశాలకు చెందిన 150 మంది ప్రతినిధులు పాల్గొంటారని, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ప్రమాణాలను పెంపొందించడంపై చర్చించి, నిర్ణయాలు తీసుకొంటారని తెలిపారు. ప్రసుత్తం ఈ టెక్నాలజీ వినియోగం ప్రారంభదశలోనే ఉన్నదని, పూర్తిస్థాయిలో ఉపయోగించకొనేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పొలిస్తే తెలంగాణలో బ్లాక్‌చైన్‌ వినియోగం ఎక్కువగా ఉన్నదని, విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీతో పాటు భూ రికార్డులను భద్రపర్చడం, చిట్‌ఫండ్‌, రిజిస్ట్రేషన్లు లాంటి కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నదని వివరించారు. బ్లాక్‌చైన్‌తో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్న నమ్మకం కలిగిందని, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడే ఈ టెక్నాలజీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జయేశ్‌రంజన్‌ పేర్కొన్నారు. బీఐఎస్‌ ప్రతినిధి జేఏ చౌదరి, తెలంగాణ ఐటీశాఖ ఓఎస్డీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.