తెలుగు వైభవంతో ఆకట్టుకుంటున్న సెయింట్ లూయిస్
Sailaja Reddy Alluddu

తెలుగు వైభవంతో ఆకట్టుకుంటున్న సెయింట్ లూయిస్

26-05-2017

తెలుగు వైభవంతో ఆకట్టుకుంటున్న సెయింట్ లూయిస్

21వ తానా మహాసభలకు సర్వం సిద్ధం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 21వ మహాసభలకు సెయింట్‌ లూయిస్‌ నగరం ముస్తాబైంది. మహాసభలు జరిగే అమెరికా సెంటర్‌లో ఇప్పుడే తెలుగువాళ్ళ సందడి కనిపిస్తోంది. మే 27 నుంచి మూడురోజులపాటు జరిగే ఈ వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మహా వేడుకను తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తెలుగువారు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే అమెరికా నగరంలోని తెలుగు కుటుంబాలు ఈ వేడుకకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యాయి. మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తానా సర్వశక్తులను కూడగట్టింది. మహాసభల నిర్వహణకోసం ఎన్నో కమిటీలను ఏర్పాటు చేసింది. మరోవైపు మహాసభలకు వచ్చేవారు మరపురాని తీపిగుర్తులుగా మిగిలిపోయే విధంగా సభల వేదికను అలంకరిస్తున్నారు. తెలుగువారి వైభవాన్ని చాటిచెప్పే రీతిలో సృజనాత్మకత ఉట్టిపడే కళారూపాలతో అన్నీ హంగులతో మహావేదికను రెడీ చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలతోపాటు ఈసారి పలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

అమెరికాలో అతి పెద్ద తెలుగు పండుగగా పేర్కొనే ఈ మహాసభల్లో ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెలుగువారి ప్రతిభాపాటవాలకు దర్పణం కట్టేలా సమావేశాలను తీర్చిదిద్దారు. తానా మహాసభలు వస్తున్నాయంటే తెలుగు కుటుంబాల్లో సంతోషం కనిపిస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారిని ఒకే చోట చూసేందుకు ఈ పండుగ దోహదం చేస్తుంది. అదే సమయంలో మహాసభలు జరిగే మూడురోజులు ఎల్లెడలా కనిపించే తెలుగువాతావరణం, తెలుగు వంటకాలు, ఇండియా నుంచి వచ్చేతెలుగువాళ్ళు చెప్పే కబుర్లు, ప్రసంగాలను వినడానికి ఎదురు చూస్తారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు ఈ కార్యక్రమం పండుగ లాంటిది. రాజకీయరంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులను స్వయంగా కలుసుకుని పలకరించే అవకాశం ఈ వేడుకల ద్వారా సాధ్యమవుతుంది. అందుకే తానా మహాసభలు పలువురికి పండుగలా కనిపిస్తుంది. విమెన్స్‌ ఫోరం, యూత్‌ ఫోరం, బిజినెస్‌ ఫోరం, ఇమ్మిగ్రేషన్‌ ఫోరం వంటివి ప్రముఖుల చేత చర్చాగోష్టులను ఏర్పాటు చేశాయి.

ఈసారి మహాసభల్లో ప్రత్యేకత ఉందని అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. తానా ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయి జరుగుతున్న మహాసభలు అని అంటూ, తానా పుట్టిన రోజు మే 28 కాబట్టి, మహాసభల్లో ఆరోజున తానా వ్యవస్థాపక అధ్యక్షుడు గుత్తికొండ రవీంద్రనాథ్‌తోపాటు తానా ప్రెసిడెంట్‌లుగా పనిచేసినవారంతా హాజరవుతున్నారని తెలిపారు. ఎల్లలు లేని తెలుగు...ఎప్పటికీ వెలుగు అన్న ధీమ్‌తో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు జంపాల చౌదరి వివరించారు.

అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్న సతీష్‌ వేమన

ఈ మహాసభల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. తానా అధ్యక్షునిగా సతీష్‌ వేమన ఈ మహాసభల్లోనే బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట ఆయన జన్మస్థలమైనప్పటికీ ఆయన విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలోనే జరిగింది. రాయలసీమకు చెందిన ఒకరు తానా అధ్యక్ష బాధ్యతలను చేపడుతుండటంతో రాయలసీమ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సతీష్‌ వేమన అభిమానులు, మిత్రులు అధ్యక్ష బాధ్యతలను చేపడుతున్న సతీష్‌ వేమనకు శుభాకాంక్షలను అందజేశారు.

Click here for Photogallery