తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

12-12-2019

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు భారీ పెట్టుబడి వచ్చింది. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు గతంలో అవగహన ఒప్పందం కుదుర్చుకున్న కొరియా టెక్స్‌టైల్‌ దిగ్గజం యంగ్‌వన్‌ కార్పొరేషన్‌ రూ.900 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. టెక్స్‌టైల్‌ పార్కులో యూనిట్‌ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వంతో తుది ఒప్పందాన్ని కుదుర్చుకొని, పరిశ్రమకు అవసరమైన భూ కేటాయింపు పత్రాలను అందుకున్నది. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, యంగ్‌వన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కిహాక్‌ సుంగ్‌, కంపెనీ ప్రతినిధి బృందం, భారత్‌, కొరియా రాయబారుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

అంతకుముందు యంగ్‌వన్‌ బృందం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును సందర్శించింది. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కార్పొరేషన్‌ యాంకర్‌ యూనిట్‌గా ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.900 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది.యూనిట్‌ స్థాపన కోసం 290 ఎకరాల భూమి కేటాయింపు పత్రాలను ప్రభుత్వం యంగ్‌వన్‌కు అందించింది. ఈ యూనిట్‌ స్థాపన ద్వారా ప్రపంచస్థాయి టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఒకటి వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటయినట్టవుతుంది. స్థానికంగా లభించే అత్యుత్తమ పత్తిని ఉపయోగించుకొని ఎగుమతులే లక్ష్యంగా, యంగ్‌వన్‌ వివిధ రకాల టెక్స్‌టైల్‌ ఉత్పత్తులను తయారుచేయనున్నది. ఈ యూనిట్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 12 వేల మందికి ఉపాధి లభించనున్నది.