అమరావతికి మద్దతుగా అట్లాంటా ప్రవాసాంధ్రుల ర్యాలీ

అమరావతికి మద్దతుగా అట్లాంటా ప్రవాసాంధ్రుల ర్యాలీ

13-01-2020

అమరావతికి మద్దతుగా అట్లాంటా ప్రవాసాంధ్రుల ర్యాలీ

జనవరి 12న అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకి మద్దతుగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీ క్రిష్ణ విలాస్ లో సుమారు 250 మందికిపైగా సమావేశమయ్యారు. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి సంబంధించిన 29 గ్రామాల రైతులపై ముఖ్యంగా మహిళలపై వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. రాజధాని గ్రామాల చుట్టుపక్కల ఉన్న కొంతమంది పెద్దలు అక్కడి అరాచక పరిస్థితులను వివరించారు. మహిళలపై పోలీసుల తీరును అప్రజాస్వామికమని తూర్పారపట్టారు. విభజించు పాలించు అనే వైసీపీ రాజకీయ వికృతక్రీడలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు, పిల్లలూ పాల్గొనడం గర్వించదగిన విషయం.

తదనంతరం అందరూ ర్యాలీగా వెళ్లి వైసీపీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'తుగ్లక్ పాలన నశించాలి', 'మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు', 'ఒక రాష్ట్రం.. ఒక రాజధాని', 'జై అమరావతి.. జై ఆంధ్రప్రదేశ్' వంటి నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారు మ్రోగించారు. చివరిగా అమరావతి పరిరక్షణ సమితికి చేదోడువాదోడుగా ఉండాలని మరియు ఆంధ్రప్రదేశ్ లోని తమ బంధువులు, స్నేహితులతో అన్ని ప్రాంతాలలోను మున్ముందు ఇలాంటి నిరసన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు.

Click here for Photogallery