చదువు.. నైపుణ్యం ఉంటేనే గ్రీన్ కార్డ్
Ramakrishna

చదువు.. నైపుణ్యం ఉంటేనే గ్రీన్ కార్డ్

09-08-2017

చదువు.. నైపుణ్యం ఉంటేనే గ్రీన్ కార్డ్

అమెరికాకు విదేశీయుల వలసల సంఖ్యను సగానికి తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్ (రైస్) బిల్లుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  సమ్మతి తెలిపారు. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా పౌరసత్వమైన గ్రీన్‌కార్డుల జారీ విధానంలో అనేక మార్పులు వస్తాయని, వలసలు సగానికి తగ్గుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఉన్నత చదువులు చదివి, ఉత్తమ నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారత్‌కు చెందిన యువతకు ఇది తీపికబురేనని చెప్తున్నారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీకి లాటరీ విధానాన్ని అమలు చేస్తున్నారు. రైస్ చట్టం అమల్లోకి వస్తే పాయింట్ల పద్ధతిని అవలంబిస్తారు. చదువు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అధిక జీతం కలిగిన జాబ్ ఆఫర్లు, వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పాయింట్లు కేటాయిస్తారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ రైస్ చట్టంతో విదేశీయులకు గ్రీన్‌కార్డ్ అందించే విధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయి.

తక్కువ నైపుణ్యాలు ఉన్నవారి వలసలు ఆగుతాయి. ఫలితంగా స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెరిగి, దేశంలో పేదరికం తగ్గుతుంది. చదువు, నైపుణ్యం ఉన్న వారికి, వారి కుటుంబాలకు రైస్ ఎంతో ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది అని పేర్కొన్నారు. విదేశీయుల కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న అమెరికన్లకు ఈ చట్టం అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం అమెరికా ఏటా పదిలక్షల మంది విదేశీయులను లాటరీ ద్వారా ఎంపిక చేసి గ్రీన్ కార్డులు అందిస్తున్నది. దాదాపు 50 ఏండ్లుగా అమలులో ఉన్న ఈ విధానం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ కలుగుతున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. గ్రీన్‌కార్డ్ పొందుతున్నవారిలో ఉన్నత చదువు, ఉత్తమ నైపుణ్యాలు, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్తున్నారు. ప్రతి 15 మందిలో ఒక్కరు మాత్రమే తమ నైపుణ్యాలతో గ్రీన్‌కార్డ్ సంపాదించుకుంటున్నారని, అమెరికాలో నివసిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని వివరిస్తున్నారు.