ఎన్‌ఆర్‌ఐ సేవలు అభినందనీయం - జయరామ్‌ కోమటి

ఎన్‌ఆర్‌ఐ సేవలు అభినందనీయం - జయరామ్‌ కోమటి

18-08-2017

ఎన్‌ఆర్‌ఐ సేవలు అభినందనీయం - జయరామ్‌ కోమటి

జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఎన్నారైలు తమ సొంత గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతి గదులను అమెరికాలోని ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, స్థానిక ప్రతినిధులతో కలిసి ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం మండలంలోని టేకిలో వీరవల్లి జోసప్‌ జడ్పీ ఉన్నత పాఠశాల్లో జరిగిన అదనపు తరగతి గదులు, డిజిటల్‌ తరగతి ప్రారంభోత్సవం కార్యక్రమంలో జయరామ్‌ కోమటితోపాటు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. అభీష్ట చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకులు, జన్మభూమి కో ఆర్డినేటర్‌ ఎన్‌ఆర్‌ఐ మేకా సతీష్‌ ఆర్థిక సౌజన్యంతో ఈ డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ, జన్మభూమి స్ఫూర్తితో ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు ఎస్‌ఎస్‌ఏ నిధులు రూ.15.80 లక్షలు వెచ్చించి నిర్మించిన మూడు అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు.  ఎన్‌ఆర్‌ఐల సహకారంతో జిల్లాలోని పలు పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డిజిటల్‌ తరగతుల ద్వారా విద్యార్థుల్లో పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. టేకి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కోమటి జయరాం మాట్లాడతూ కపిలేశ్వరపురం మండలంలో ప్రభుత్వం సహకారం, ఎన్‌ఆర్‌ఐల ప్రోత్సాహంతో 11 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 5200 డిజిటల్‌ తరగతులు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రస్తుతం 2,250 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎన్‌ఆర్‌ఐలు ప్రభుత్వంతో కలిసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారన్నారు.

గ్రామానికి చెందిన తెదేపా నేత దామిన వీరరాఘవులు(అబ్బు) ఆర్థిక సౌజన్యంతో పాఠశాల మైదానంలో నిర్మించిన కాటన్‌ విగ్రహాన్ని పూర్వపు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఉన్నత పాఠశాల వ్యవస్థాపకులు వీరవల్లి జోసప్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచి గంటి వీరవేణి, ఎంపీపీ కాద వెంకట రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు మేడిశెట్టి సత్యవేణి, గుత్తుల వీరకుమారి తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery