జన్మభూమి లక్ష్యాన్ని సాధిస్తున్నాం....జయరామ్‌ కోమటి
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

జన్మభూమి లక్ష్యాన్ని సాధిస్తున్నాం....జయరామ్‌ కోమటి

01-09-2017

జన్మభూమి లక్ష్యాన్ని సాధిస్తున్నాం....జయరామ్‌ కోమటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయసాధనలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్నారైల చేయూతతో డిజిటల్‌ తరగతులు, అంగన్‌వాడీ భవన కేంద్రాల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధిలో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నట్లు అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి చెప్పారు. ఎన్నారైలు కూడా తమ ఊరి బాగుకోసం ముందుకు వస్తున్నారని చెప్పారు. సొంతగడ్డను అభివృద్ధి పరుచుకునే క్రమంలో శక్తి వంచన  లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. విద్యాశాఖ, రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖతో కలిసి ఇప్పటివరకు 1500 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను, అంగన్‌వాడీ కేంద్రాలను, శ్మశానవాటికలను అభివృద్ధిపరిచామని చెప్పారు. డిజిటల్‌ తరగతుల వల్ల పిల్లల్లో ఉత్సాహం పెరిగిందని, సులువుగా పాఠ్యాంశాలను అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. దీంతో పిల్లల హాజరు శాతం కూడా పెరిగిందని విద్యాశాఖ తెలిపిందన్నారు. రెండవ విడతగా మరో 630  పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను  ఏర్పాటు చేస్తున్నట్లు జయరాం తెలిపారు.

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్‌ చేయాలన్న లక్ష్యాన్ని త్వరలోనే సాధిస్తామని ఆయన చెప్పారు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను  ఏ పాఠశాలల్లో ఎంతమేర ఉపయోగిస్తున్నారు, ఎన్ని  గంటలు ఉపయోగిస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు సీఎం డ్యాష్‌ బోర్డులో నమోదయ్యేలా అనుసంధానం చేసినట్లు ఆయన వివరించారు. డిజిటల్‌ తరగతులను సమర్దవంతంగా ఉపయోగించే పాఠశాలలకు ప్రోత్సాహక బహుమతులను కూడా అందించి ప్రోత్సహిస్తున్నామని కూడా చెప్పారు.

జూన్‌ నెలాఖరులో ఎపి పర్యటకు వచ్చిన జయరామ్‌ కోమటి ఎన్నారైలు ఇచ్చిన విరాళాలతో రెడీ అయిన డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నారైలతో కలిసి ఆయన పర్యటించినప్పుడు ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లాలో మల్లవోలు గ్రామంలో, ప్రకాశం జిల్లా బసవన్నపాలెం గ్రామంలో, ప్రత్తిపాడు గ్రామంలో, రాజుపాలెం మండలం, ఎడ్లపాడు మండలంలో డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో జయరామ్‌ కోమటి పాల్గొన్నారు. అక్కడ ఉన్న బరియల్‌ గ్రౌండ్‌ అభివృద్ధి పనులను పర్యవేక్షిరచారు. విశాఖపట్టణంలో జరిగిన అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు.తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో శ్మశానవాటికల అభివృద్ధి, టేకిలో డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో జయరామ్‌ కోమటి పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ఇబ్రహీంపట్నంలో జరిగిన డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో, ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో, కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు గ్రామంలో జరిగిన డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో జయరామ్‌ కోమటి పాల్గొన్నారు.

జగ్గయ్యపేటలో జరిగిన డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ కె. సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. రాష్ట్రపంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి కూడా జయరామ్‌ కోమటితోపాటు వివిధ చోట్ల జరిగిన డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

తన పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులుతోనూ, విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌, మేయర్‌తోనూ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ను కూడా జయరామ్‌ కోమటి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో జయరామ్‌ వెంట ప్రసాద్‌ గారపాటి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, తానా బోర్డ్‌ చైర్మన్‌ చలపతి కొండ్రకుంట ఇతర ఎన్నారైలు పాల్గొన్నారు.