క్లీవ్‌లాండ్‌లో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన

క్లీవ్‌లాండ్‌లో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన

12-03-2017

క్లీవ్‌లాండ్‌లో  కూచిపూడి, భరతనాట్య  ప్రదర్శన

అమెరికాలో భరతనాట్యం, కూచిపూడికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు అరుదైన అవకాశం దక్కింది. ఆ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంది. తొలిసారిగా ప్రఖ్యాత క్రీడా వేదికపై తానా ఆధ్వర్యంలో భారత శాస్త్రీయ నృత్య రీతులు తళుక్కున మెరిశాయి. ప్రఖ్యాత నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ లీగ్‌లో భాగంగా ప్రవాసాంధ్ర బాలికలు, యువతుల బృందం కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు చేసింది. ఈ నాట్య ప్రదర్శనలు క్రీడాభిమానులను, కళాభిమానులను అలరించింది. క్లీవ్‌లాండ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ క్లీవ్‌లాండ్‌ క్వావలియర్స్‌, మియామీ హీట్‌ జట్ల మధ్య ప్రతిష్టాత్మక మ్యాచ్‌ సందర్భంగా ప్రైమ్‌ టైమ్‌లో బాస్కెట్‌ బాల్‌ కోర్టుపై సాగిన నృత్య ప్రదర్శన కనుల పండువగా సాగింది.

తానా కల్చరల్‌ కోఆర్డినేటర్‌ అశోక్‌ బాలు కొల్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనకు రామారావు పంగులూరి, రవిచంద్ర వడ్లమూడి సహకరించారు. గతంలో ఏ తెలుగు సంస్థకు ఇటువంటి అవకాశం దక్కలేదని, ఈ ప్రదర్శన ద్వారా తానా గొప్ప మైలురాయిని అధిగమించిందని అశోక్‌ బాబు చెప్పారు. నృత్య ప్రదర్శనలు ఇచ్చిన వారితో పాటు వారి గురువులకు తానా అధ్యక్షుడు డాక్టర్‌ జంపాల చౌదరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విశేష కార్యక్రమానికి నింబిల్‌ అకౌంటింగ్‌, మైప్రోగ్రెస్‌కార్డ్‌.కాం సంస్థలు తోడ్పాటునందించినట్లు అశోక్‌ బాబు కొల్లా తెలిపారు.