భారతీయులపై గుర్రుమంటున్న అమెరికా...
APEDB
Ramakrishna

భారతీయులపై గుర్రుమంటున్న అమెరికా...

12-03-2017

భారతీయులపై గుర్రుమంటున్న అమెరికా...

అమెరికాలో ఇటీవల భారతీయుల భద్రత అంశం అక్కడ, ఇక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. మరోవైపు ట్రంప్‌ పాలకవర్గం కూడా ప్రవాస భారతీయులకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపడుతోంది. భారతీయులు హెచ్‌-1బీ వీసాలతో వచ్చి మన ఉద్యోగాలన్నీ మింగేస్తున్నారు. వీటికి కళ్లెం వేయాల్సిందేనని అమెరికా సెనెట్‌, ప్రతినిధుల సభల్లోని కొందరి సభ్యుల అభిప్రాయం. హెచ్‌-1బీ వీసాల జారీని సంస్కరించాలంటూ ఉభయ సభల్లో ఆరు బిల్లులను వీరు ప్రవేశపెట్టారు. వీరిలో అధికార రిపబ్లికన్లతోపాటు, డెమొక్రాట్లూ ఉండటం గమనార్హం.

రిపబ్లికన్‌ సెనెటర్‌ చుక్‌ గ్రాస్‌లీ, అసిస్టెంట్‌ సెనేటర్‌ మైనారిటీ లీడర్‌ డిక్‌ డర్బిన్‌ మొట్టమొదటిసారిగా హెచ్‌-1బీ ఎల్‌-1 వీసా సంస్కరణల చట్టం ప్రవేశపెట్టారు. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని అందులో ప్రతిపాదించారు. లాటరీ పద్ధతి మార్చి వేయాలని, అమెరికా వర్సిటీల్లో చదువకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అందులో కోరారు. అలాగే 50 కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండి, వారిలో సగం హెచ్‌-1బీ లేదా ఎల్‌-1 వీసాదారులున్న కంపెనీలు అదనంగా విదేశీయులను నియమించుకోరాదని కూడా ప్రతిపాదించారు.

తాత్కాలిక శిక్షణకు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులను రప్పించే ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై గట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అంతేకాదు ఒక అమెరికన్‌ ఉద్యోగిని పక్కనపెట్టి ఆ స్థానంలో విదేశీయులను ఎట్టి పరిస్థితుల్లో నియమించకూడదని సృష్టం చేశారు. అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఉదరిస్తూ తమ ప్రతిపాదననలు పొందుపరిచారు. ఇక కాంగ్రెస్‌లో సిలికాన్‌ వ్యాలీకి (కాలిఫోర్నియా) డెమొక్రాట్‌ నేత జో లఫ్రోజెన్‌ కూడా ఓ  బిల్లు పెట్టారు. హెచ్‌-1బీ వీసాలపై వచ్చే వారికి కనీసం వార్సిక వేతనాన్ని రెట్టింపు చేసి, 1.30 లక్షల డాలర్లకు పెంచాలని కోరింది ఆయనే. హై స్కిల్డ్‌ ఇంటెగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌ పేరిట ఆయన  ఈ బిల్లును ప్రతిపాదించారు. ఒక్కో దేశానికి ఇన్ని చొప్పున కోటా పెట్టకుండా,  ముందుగా ఎవరు కోరితే వాళ్లకు (ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌) వీసాలు జారీ చేయాలని కూడా కోరారు. ఇంకా సెనెటర్లు, షెరాడ్‌ బ్రౌన్‌, జో డాన్‌లీ, క్రిస్టెన్‌ గిల్లిబ్రాండ్‌ కలిసి ఔట్‌సోర్సింగ్‌కు తెర దించాలి అని మరో బిల్లు ప్రతిపాదించారు. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకే ప్రభుత్వ పనులు అప్పగించాలన్నది ఈ బిల్లు సారాంశం.

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన టామ్‌ కాటన్‌, డేవిడ్‌ పర్డ్యూలు మొత్తంగా పదేళ్లపాటు  ఏటా అమెరికాలోని  వలసలకు కత్తెర వేయాలంటూ బిల్లు తీసుకొచ్చారు. ఇటీవల భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు ఖన్నా మరో ముగ్గురితో కలిసి హెచ్‌-1బీ, ఎల్‌-1 వర్క్‌ వీసాల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురాలని ప్రత్యేక బిల్లు తీసుకొచ్చారు. వలసల విధానాలను సమూలంగా మార్చాలని ట్రంప్‌ భావిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లులకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి వలసదారుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. మరోవైపు హెచ్‌-1బీ, వీసాదాలదారుల్లో పీహెచ్‌డీలు, కంప్యూటర్‌ సైంటిస్టులనే తాము కోరుకుంటున్నామని, మిడిల్‌ లెవెల్‌ ఉద్యోగులు అక్కర్లేదన్నారు. కాటన్‌ ఇటీవలే ట్రంప్‌ను కలిసి తన అభిప్రాయాలు పంచుకున్నారు.