చికాగోలో ఆటా మెడికల్‌ క్యాంప్‌ సక్సెస్‌
MarinaSkies
Kizen

చికాగోలో ఆటా మెడికల్‌ క్యాంప్‌ సక్సెస్‌

14-09-2017

చికాగోలో ఆటా మెడికల్‌ క్యాంప్‌ సక్సెస్‌

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో చికాగోలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరం విజయవంతమైంది. సెప్టెంబర్‌ 9వ తేదీన బెథనీ ఆఫ్‌ ఫాక్స్‌ వ్యాలీ యునైటెడ్‌ మెథడిస్ట్‌ చర్చ్‌లో జరిగిన ఈ క్యాంప్‌లో దాదాపు 200 మంది హాజరై వైద్యపరీక్షలను చేసుకున్నారు. తొలుత వచ్చినవారికి రోగనిర్దారణ పరీక్షలు చేశారు. రక్తనమూనాలు సేకరించి హెమోగ్లోబిన్‌ టెస్ట్‌, జీవప్రక్రియల పనితీరు, లిపిడ్‌ టెస్ట్‌లు, పేగు క్యాన్సర్‌ పరీక్షలు చేశారు. కార్డియాలజీ, హెమటాలజీ, గైనకాలజీ, అంకాలజీ, అనస్థియోలజి, రేడియోలజీ పరీక్షలను కూడా చేసి అవసరమైన వారికి మందులను కూడా అందజేశారు. దంత సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందజేశారు. ఈ శిబిరానికి హాజరైనవారికి వచ్చే క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షల్లో రాయితీలను కూడా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు.

ప్రాథమిక సంరక్షణ, స్పెషలిస్ట్‌ డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ వైద్యశిబిరం జరిగింది.  20 మందికిపైగా స్పెషలిస్టులు, 15 మంది మెడికల్‌ స్టూడెంట్‌లు, 15 మంది ఆటా నిర్వాహకులు, 20 మంది వలంటీర్లు ఈ ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్నారు. డాక్టర్‌ వేమూరి మూర్తి ఆధ్వర్యంలో నడుస్తున్న చికాగో మెడికల్‌ సొసైటీ హ్యాండ్స్‌ ఆన్‌ సిపిఆర్‌ అండ్‌ ఎఇడిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆటా అడ్వయిజరీ చైర్‌పర్సన్‌ హన్మంత్‌ రెడ్డి, ట్రస్టీ డాక్టర్‌ మెహర్‌ మేదావరం, రీజినల్‌ డైరెక్టర్‌ వెంకట్‌ తుడి, రీజినల్‌ కో ఆర్డినేటర్స్‌ మహిపాల్‌ రెడ్డి, హరి రాయిణి, స్టాండింగ్‌ కమిటీ మెంబర్స్‌ సాయినాథ్‌ బోయిపల్లి, రమణ అబ్బరాజు, జగన్‌ బుక్కరాజు, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, మహిధర్‌ ముసుకుల, కరుణాకర్‌, రమణ అబ్బరాజు, అమర్‌, లక్ష్మీ బోయపల్లి తదితరులు పాల్గొన్నారు.