జీఈఎస్ సూపర్ సక్సెస్

జీఈఎస్ సూపర్ సక్సెస్

30-11-2017

జీఈఎస్ సూపర్ సక్సెస్

అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు (జీఈఎస్‌)ను దిగ్విజయంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వంపై అమెరికా ప్రశంసలు కురిపించింది. జీఈఎస్‌ సదస్సు ద్వారా భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయని అమెరికా అభిప్రాయపడింది. రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యున్న స్థాయికి చేరుకుంటున్నట్లు ఇవాళ భారత్‌లో ఉన్న అమెరికా దౌత్యవేత్త కెన్‌ జస్టర్‌ ట్వీట్‌ చేశారు. జీఈఎస్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందని జస్టర్‌ తన ట్వీట్‌లో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు ఇవాంకా ట్రంప్‌, నీతి ఆయోగ్‌, భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వానికి అంబాసిడర్‌ కెన్‌ జస్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అమెరికన్‌ అంబాసిడర్‌ కెన్‌ జస్టర్‌ హైదరాబాద్‌ నగరాన్ని కూడా విశేషంగా కొనియాడారు. హైదరాబాద్‌ నగరం అత్యద్భుతమన్నారు. భారతీయ సంపన్న సంస్కృతి, చరిత్రను హైదరాబాద్‌ ప్రస్ఫుటం చేస్తుందని జస్టర్‌ తన ట్వీట్‌లో తెలిపారు. గోల్కొండ కోటలో సందర్శించిన అంశాన్ని కూడా ఆయన ట్వీట్‌ చేశారు. ఇవాంకా ట్రంప్‌తో పాటు జస్టర్‌ హైదరాబాద్‌లోని గోల్కొండ ఫోర్టును సందర్శించారు. అమోఘ చరిత్రకు గోల్కొండ ఓ తార్కణమని ఆయన అన్నారు.  ఫోటోగ్రఫీ ప్రియులకు కూడా గోల్కొండ ఓ సుందర ప్రదేశమన్నారు. గోల్కొండ ట్రిప్‌ ఓ ఎడ్యుకేషనల్‌ టూర్‌గా సాగిందని జస్టర్‌ ట్వీట్‌ చేయడం విశేషం. అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌కు కూడా అంబాసిడర్‌ కెన్‌ జస్టర్‌ థ్యాంక్స్‌ తెలిపారు. ఇవాంకా జీఈఎస్‌ పర్యటన అమెరికాకు చాలా ఉపయుక్తంగా మారిందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలతో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇవాంక గడిపిన తీరు గర్వించదగ్గ అంశమని జస్టర్‌ ట్వీట్‌ చేశారు.