తేనె తుట్టెను కదిపిన ట్రంప్‌!

తేనె తుట్టెను కదిపిన ట్రంప్‌!

06-12-2017

తేనె తుట్టెను కదిపిన ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేనె తుట్టెను కదిపారు. ఇక నుంచి ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరుసలెంను అమెరికా గుర్తించనున్నది. దీనిపై భారత కాలామానం ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారిక ప్రకటన చేయనున్నారు. దశాబ్దాలుగా ఉన్న అమెరికా విధానంతో పాటు ప్రజల ఆకాంక్షలు, ఆ ప్రాంతంలోని మిత్ర దేశాల హెచ్చరికలు ట్రంప్‌ పక్కన పెట్టేశారు. అంతేకాదు ఇప్పటివరకు టెల్‌ అవిల్‌లో ఉన్న అమెరికా ఎంబసీని కూడా జెరుసలెంకు తరలించనున్నట్లు ట్రంప్‌ ఈ ప్రకటనలోనే చెప్పమన్నారు. ఈ ప్రక్రియకు కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా విదేశాలకు వెళ్లే అమెరికా పౌరులకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నది. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పటికే పాలస్తీనియన్‌ నేషనల్‌ సెక్యూరిటీ, సౌదీ అరేబియా, జోర్డాన్‌, ఈజిప్ట్‌, ఇజ్రాయెల్‌ దేశాల నేతలకు ట్రంప్‌ ఫోన్ల ద్వారా సమాచారమిచ్చారు.