యూఎస్ లో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త

యూఎస్ లో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త

12-12-2017

యూఎస్ లో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త

అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త. గోల్డెన్‌ వీసాగా పరిగణించే ఈబీ5 వీసాల దరఖాస్తుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. ఈ వీసాలు పొందాలనుకునే వారికి ఇది వూరట కల్పించే అంశమని, అయితే గడువు పొడిగింపునకు ఇదే చివరి అవకాశమని విశ్లేషకులు అంటున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో వచ్చిన తర్వాత హెచ్‌-1బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ఈ  వీసా ప్రోగ్రామ్‌ను 1990లో యూఎస్‌ కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టి నిరుద్యోగ అమెరికన్‌ యువతకు ఉపాధి కల్పించాలి. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుకోవాలని అనుకునేవారికి ఇది నిజంగా గోల్డెన్‌ ఛాన్స్‌. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్‌-1బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు. తమ కుటుంబాలతో సహా అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఈబీ5 వీసా అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా వీసాలను పొందడంలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారు. హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం అయిన నేపథ్యంలో ఈబీ5కి ఆదరణ పెరిగిందని, భారత్‌ నుంచి ఈ తరహా వీసాలకు దరఖాస్తులు కూడా పెరగనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.