తెలుగు మహాసభలపై ఎన్నారైల ఆసక్తి మహేష్‌ బిగాల

తెలుగు మహాసభలపై ఎన్నారైల ఆసక్తి మహేష్‌ బిగాల

13-12-2017

తెలుగు మహాసభలపై ఎన్నారైల ఆసక్తి  మహేష్‌ బిగాల

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన హైదరాబాద్‌లో  డిసెంబర్‌ 15వ తేదీ నుంచి 19 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలపై ఎన్నారైలు ఎంతో ఆసక్తిని చూపారని మహాసభల ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు. ఎన్నారై కో ఆర్డినేటర్‌గా ఆయన అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ మహాసభల సన్నాహక సదస్సులను నిర్వహించి, ఎన్నారైలను మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరపున, మహాసభల నిర్వహణ కమిటీ తరపున ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు తెలుగు మహాసభలను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారని మహేష్‌ బిగాల తెలుగు టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సన్నాహక సదస్సులను ఏఏ దేశాల్లో నిర్వహించారు?

అమెరికాలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నాలుగైదు చోట్ల సన్నాహక సదస్సులను నిర్వహించాము. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, డల్లాస్‌, న్యూజెర్సిలో ఈ సన్నాహక సదస్సులు జరిగాయి. టొరంటో (కెనడా), వియన్నా (ఆస్ట్రియా)లో కూడా నిర్వహించిన సన్నాహక సదస్సుల్లో నేను పాల్గొన్నాను.    ఆస్ట్రేలియా, దుబాయ్‌, దక్షిణాఫ్రికా, సింగపూర్‌, మలేషియా, న్యూజిలాండ్‌, డెన్మార్క్‌లో కూడా నవంబర్‌ 26న సన్నాహక సదస్సులు జరిగాయి.

సన్నాహక సదస్సులకు స్పందన ఎలా ఉంది?

వివిధ దేశాల్లో, ప్రదేశాల్లో జరిగిన సన్నాహక సదస్సులో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషపై చూపుతున్న గౌరవాన్ని మమకారాన్ని పొగిడారు. మహాసభల్లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని ఆసక్తిని ప్రదర్శించారు.

మహాసభలకు ఎంతమంది ఎన్నారైలు వస్తున్నారు?

దాదాపుగా చాలా దేశాల నుంచి ఎన్నారైలు మహాసభలకు హాజరవుతున్నారు. పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి తెలుగు ఎన్నారై ప్రముఖులు వస్తున్నారు. యుకె, సింగపూర్‌, మలేషియా, మారిషస్‌ తదితర దేశాల నుంచి కూడా ప్రతినిధులు మహాసభలకు వస్తున్నారు.

మహాసభల కోసం వస్తున్న ఎన్నారైలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాము.