అమెరికాలో తెలుగు భాషా ప్రతినిధిగా చేకూరి

అమెరికాలో తెలుగు భాషా ప్రతినిధిగా చేకూరి

12-01-2018

అమెరికాలో తెలుగు భాషా ప్రతినిధిగా చేకూరి

గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు, తెలుగు భాషాభిమాని, వ్యాఖ్యాత చేకూరి కోటేశ్వరరావును అమెరికా, కెనడా దేశాల్లో తెలుగు భాషా సంస్కృతిక వికాసానికి ప్రత్యేక ప్రతినిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. మృతభాషగా బలిపీఠం మీద ఈసురోమంటున్న తరుణంలో దాన్ని నవీన సాంకేతికత సాయంతో పరిరక్షించి ఎత్తుపీఠానికి బాటలు పరిచేయందుకు తన శక్తిమేర కృషి చేస్తానని కేసీ వెల్లడించారు. ప్రవాసులను అక్షరమనే ఆశయంతో ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. సముద్రపు జలాలతో బరువెక్కిన మబ్బులు అదే సముద్రంపై వర్షం కురిపించినట్లు, అమ్మ దేశం నుండి అమెరికాకు వచ్చిన తాము ఆ అమ్మ భాషకు సేవ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అమెరికా, కెనడా దేశాల్లో తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిని నియమించింది. అమెరికాకు చెందిన తానా పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ కేసీ చేకూరిని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ పర్యాటకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి గౌరవ వేతనం లేకుండా స్వచ్ఛందంగా ఈ ప్రత్యేక ప్రతినిధి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏడాది పాటు కృషి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.