లాస్‌ ఏంజెల్స్ లో నారా లోకేష్

లాస్‌ ఏంజెల్స్ లో నారా లోకేష్

29-01-2018

లాస్‌ ఏంజెల్స్ లో  నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యం తగ్గించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగానూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన లాస్ ఏంజెల్స్ లో ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. సిస్ ఇంటెలి సిఈఓ రవి హనుమారతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రవి స్పందిస్తూ.. తక్షణం 100 మంది ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్‌లో సంస్థను ప్రారంభిస్తామని, రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సులభతరంగా ఐటీ సంస్థలు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన వివిధ పాలసీలను లోకేశ్ వారికి వివరించారు. 

అనంతరం అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పాలో మీరాతోను లోకేశ్ సమావేశమయ్యారు. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ రంగాన్ని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వారికి వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి రూపొందించిన నూతన పాలసీలను సంస్థ ప్రతినిధుల దృష్టికి లోకేశ్ తీసుకెళ్లారు. 

త్వరలోనే రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మార్కెట్ అంచనా, పాలసీలు, రాయితీల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత్‌లో బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని... ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్ భరోసా ఇచ్చారు. సాఫ్ట్ హెచ్క్యూ సిఈఓ క్రాంతి పొన్నం తోను మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఎంటర్ప్రైస్ స్టాఫ్ అగ్యుమెంటేషన్, మెచ్యూర్‌ మోడల్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ కంట్రోల్, సేర్వేలెన్స్ ప్లాన్ తదితర రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో కాగిత రహిత పాలనకు ప్రయత్నిస్తున్నామని... ఈ-ప్రగతితో పాటు బ్లాక్ చైన్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ ఫిన్ టెక్ లాంటి అధునాతన సాంకేతికతలను ప్రోత్సహిస్తున్న తీరును లోకేశ్ వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో తమ కార్యకలాపాలు విస్తరించాలి అనుకుంటున్నట్లు తెలిపిన సీఈవో క్రాంతి పొన్నం.. త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు రానున్నట్లు వెల్లడించారు.

Click here for Photogallery