న్యూజెర్సిలో లోకేష్ మీటింగ్ కు అద్భుత స్పందన

న్యూజెర్సిలో లోకేష్ మీటింగ్ కు అద్భుత స్పందన

05-02-2018

న్యూజెర్సిలో లోకేష్ మీటింగ్ కు అద్భుత స్పందన

న్యూజెర్సిలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో తెలుగువాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ, అందరూ అబ్బురపడేలా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని నిర్మిస్తామని అన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి పునాది వేసిందే చంద్రబాబు అని అంటూ, వచ్చే ఏడాదికల్లా నవ్యాంధ్రలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు ఐటీ రంగం మొత్తం హైదరాబాద్‌లో ఉండిపోయిందని, అయినా గత మూడున్నరేళ్లలో 24 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్‌ తెలిపారు.

అమరావతికి ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, అమరావతికి హెచ్‌సీఎల్‌, తిరుపతికి జోహో వచ్చాయన్నారు. 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల యువకుడిలా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. 9 నెలల్లో రెండు నదులను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదేనని,  2019 నాటికి పోలవరం నుంచి తాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్నారైలను చూసి 'మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోంద'ని లోకేశ్‌ సరదాగా అన్నారు. తరువాత లోకేష్‌ ఎన్నారై టీడీపీ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్‌, ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరు, నాట్స్‌ అధ్యక్షుడు మోహన్‌కృష్ణ మన్నవ, ఎన్‌ఆర్‌ఐలు బ్రహ్మాజీ, శేఖర్‌, రమేష్‌, రాధా,  తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి, విద్యాధర్‌ గారపాటి తదితరులతో పాటు, ఎపిఎన్‌ఆర్‌టీ నాయకుడు బుచ్చి రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery