నూతనోత్సాహంతో అందరిని అలరించిన టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు

నూతనోత్సాహంతో అందరిని అలరించిన టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు

06-02-2018

నూతనోత్సాహంతో అందరిని అలరించిన టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు

అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేసి సాంస్కృతిక బృంద సమన్వయకర్త పద్మశ్రీ తోట ఆధ్వర్యంలో, శీలం కృష్ణవేణి గారి అధ్యక్షతన డాలస్ లో జనవరి 27వ తేదీన  స్థానిక మార్తోమా చర్చి ఆడిటోరియంలో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి.

ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఆసక్తి కరంగా సాగాయి. శాస్త్రీయ నృత్యం చూస్తే టాంటెక్స్ వేడుకలలోనే చూడాలి అనేలా కూచిపూడి నృత్యాలు,  “ధైర్యే సాహసే లక్ష్మి” అనే నృత్యరూపకం పలువురిని ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు పిల్లలు చేసిన నృత్యాలు హుషారు కొలిపాయి. వినూత్నంగా   “అమ్మ”  పాటలతో సాగిన నృత్య రూపకం అందరిని ఎంతగా అలరించింది. 

టాంటెక్స్ నూతన అధ్యక్షులు శీలం కృష్ణవేణి గారిని తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు సభకు పరిచయం చేసారు. కృష్ణవేణి గారు,  2018 వ సంవత్సరానికి నూతన కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులను పేరు పేరున , వినూత్నంగా ఒక ప్రత్యేక వీడియో ద్వారా పరిచయం చేస్తూ, టాంటెక్స్ స్థాపించిన కాలం నుంచి ఇప్పటి వరకు అందించిన సేవలు, కార్యక్రమాల వివరాలను , చిత్ర మాలిక ద్వారా అందించారు.  అటు పిమ్మట అధ్యక్షులు శ్రీమతి శీలం కృష్ణవేణి  గారు మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పర్వదినాన నూతన ఉత్సాహంతో  తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్ధంగా, నిస్వార్ధ కళా సేవకులు , నిర్విరామ శ్రామికులు తన కార్యవర్గ సభ్యుల అండదండలతో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలకు తన శాయశక్తులా సహాయ పడతానని, 32 సంవత్సరాల చరిత్ర కలిగిన టాంటెక్స్  వంటి విశిష్ట సంస్థకు అధ్యక్ష పదవి చేపట్టినందుకు సర్వదా కృతజ్ఞురాలునని అని, టాంటెక్స్  సంస్థ తెలుగు వారందరికీ మరింత చేరువయ్యేలా చేసి, తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 

తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, నూతన కార్యవర్గం అత్యుత్సాహంతో బాధ్యతలు పంచుకొనేందుకు సంయక్తం అవడం , గడచిన సంవత్సరం అంతా మీరు అందించిన సహాయ సహకారాలు  ఈ సంవత్సరం కూడా కొనసాగించమని, తెలుగు జాతి అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారికి శాలువా కప్పి పుష్ప గుచ్చాలతో టాంటెక్స్ అధ్యక్షులు శీలం కృష్ణవేణి గారు, కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే కార్యనిర్వాహక/పాలక మండలి  సభ్యులుగా విశేష సేవలందించి, బయటకు వచ్చిన  రొడ్డ రామకృష్ణ రెడ్డి. పుట్లూరు రమణారెడ్డి లను శాలువా, జ్ఞాపిక తో సత్కరించారు. 

2017 సంవత్సరపు పోషక దాతల నందరిని కృష్ణారెడ్డి ఉప్పలపాటి, శీలం కృష్ణవేణి,  మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు.

క్రొత్తగా ఎన్నికైన సంస్థ కార్యనిర్వాహక సభ్యులు  కోడూరు కృష్ణారెడ్డి, పాలేటి లక్ష్మి, బండారు సతీష్, చంద్ర పోలీస్, బొమ్మ వెంకటేష్, యెనికపాటి జనార్ధన లను మరియు పాలక మండలి సభ్యులు నీలపరెడ్డి మధుసూదన్ రెడ్డి,  మందాడి ఇందు రెడ్డి, నెల్లుట్ల పవన్ రాజ్, అర్రెబోలు దేవేందర్ రెడ్డి లను  సాదరంగా కమిటీలోకి ఆహ్వానించారు. 

తిరిగి ప్రారంభం అయిన కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ సినీనటి  రజిత గారు తన హాస్యోక్తుల తో, చిరు నాటికతో  ప్రేక్షకులను అలరించారు. అటు తరువాత స్థానిక సినీ గాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన “సంక్రాంతి సరిగమలు” సంగీత విభావరి  ప్రేక్షకులను మరింత ఉత్సాహంతో నింపింది. అతిధి రజిత గారిని సంస్థ కార్యవర్గ సభ్యులు శాలువ మరియు జ్ఞాపికతో సత్కరించారు.

సంస్థ కార్యదర్శి మండిగ శ్రీలు, ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు విందు భోజనం వడ్డించిన కేఫ్ బహార్  రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు  ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికి టాంటెక్స్ తరపున కృతఙ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏసియా మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, ఎక్ నజర్, టీవీ5, టి.ఎన్.ఐ,తెలుగు టైమ్స్, ఐఏసియా టివి  లకు  కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన మరియు శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలలకు తెరపడింది.

Click here for Event Gallery