యువ వలసదారుల భవితపై సెనేట్ చర్చ

యువ వలసదారుల భవితపై సెనేట్ చర్చ

14-02-2018

యువ వలసదారుల భవితపై సెనేట్ చర్చ

అమెరికా పౌరసత్వం కోసం కలలు కంటున్న దాదాపు 18 లక్షల మంది యువ వలసదారుల (స్వాప్నికుల) భవితపై సెనేట్‌ సోమవారం నాడు చర్చ ప్రారంభించింది. వలసదారులకు పౌరసత్వం మంజూరు చేసే విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌ సరికొత్త చట్టం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ ప్రారంభం కావటం విశేషం. స్వాప్నికులకు అమెరికా పౌరసత్వాన్ని మంజూరు చేయాలన్న డెమొక్రాటిక్‌ పార్టీ డిమాండ్లపై బేరం పెట్టిన ట్రంప్‌ దీనికి బదులుగా వలసలపై భారీ కోతలతో పాటు మెక్సికన్‌ సరిహద్దుల్లో తలపెట్టిన గోడ నిర్మాణానికి నిధుల మంజూరుకు అనుమతించాలని కోరారు. వచ్చే నెలారంభంలో పౌరసత్వ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తున్న వేలాది మంది వలసదారులను కాపాడాలన్న అంశంతో వలసల విధానంలో వైఫల్యాలకు అడ్డుకట్ట వేయాలన్న అంశం కూడా జతకలవటంతో ట్రంప్‌ ప్రతిపాదనపై సెనేటర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.ఈ మేరకు అవగాహన కుదిరితే రిపబ్లికన్‌ పార్టీ మరింత సంతోషిస్తుందన్నారు.

వలస విధానంపై సమగ్ర చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు సెనేట్‌ సోమవారం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా కొంతమంది కన్జర్వేటివ్‌ సెనేటర్లు స్వాప్పికులకు 10-12 ఏళ్ల పాటు పరిమిత స్థాయిలో పౌరసత్వాన్ని కల్పించాలన్న ప్రతిపాదనతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరసత్వ మంజూరు కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ పద్ధతిని రద్దు చేయటంతో పాటు కుటుంబ ఆధారిత వలస విధానంపై పరిమితులు విధిస్తుంది.