ఎక్కడ కొనాలో.. అవగాహన ఉండాలి
MarinaSkies
Kizen
APEDB

ఎక్కడ కొనాలో.. అవగాహన ఉండాలి

14-03-2017

ఎక్కడ కొనాలో.. అవగాహన ఉండాలి

నగరంలోని నిర్మాణ ప్రాజెక్టులను చూస్తే కొన్ని సంస్థలు ఒకటి పూర్తికాగానే మరొకటి మొదలెడతాయి. మరికొన్నయితే ఏకకాలంలోనే రెండు మూడుచోట్ల చేపడతాయి. ఇంకొన్ని సంస్థలు దశాబ్దాల తరలబడి ఒకే చోట దశలవారీగా ప్రాజెక్టును చేపడుతుంటాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థలంలో డిమాండ్‌కు అనుగుణంగా విడతల వారీగా నిర్మాణాలను చేపడతాయన్నమాట. ఒక్కో టవర్‌ను పూర్తి చేశాక.. కొనుగోలుదారుల స్పందనను బట్టి విస్తరించుకుంటూ వెళతాయి. వీటిలో కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలు చూడాలి.
కట్టగలరా లేదా..
దశలవారీగా చేపట్టే ప్రాజెక్టుల్లో నిర్మాణదారుడి సామర్థ్యం వెల్లడయ్యే అవకాశం ఉంది. మొదటి దశను చెప్పిన సమయానికి పూర్తి చేశారా లేదా అనేది కొనుగోలుదారులు తెలుసుకునే వీలుంటుంది. దీన్ని బట్టి ఆయా సంస్థలు తర్వాతి దశల్లో చేపట్టే ప్రాజెక్ట్‌లో ఇల్లు కొనుగోలు చేయాలా లేదా అనే నిర్ణయానికి రావొచ్చు. గడువులోపు పూర్తిచేస్తే ఆర్థికంగా సమస్యలూ లేనట్లే. తర్వాతి దశలో కొనుగోలును పరిశీలించవచ్చు.
సౌకర్యాలు ఉన్నాయా..
విడతలవారీగా చేపట్టే ప్రాజెక్టుల్లో అంతకుముందు పూర్తికావచ్చిన నిర్మాణాన్ని కొనుగోలుదారులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. బ్రోచర్‌లో చెప్పిన సౌకర్యాలన్నీ కల్పించారా లేదా? నిర్మాణం నాణ్యత ఎలా ఉంది వంటి విషయాలను పరిశీలించవచ్చు. అప్పటికే కొత్త ఇంట్లోకి ఎవరైనా దిగి ఉంటే వారి అభిప్రాయాన్నీ తీసుకోవచ్చు.
రుణం సులువు
ఎక్కువమంది సొంతింటి కలను గృహరుణం ద్వారానే సాకారం చేసుకుంటారు. భూ యాజమాన్య హక్కు వంటివన్నీ సక్రమంగానే ఉంటేనే రుణాలు పొందడం సులువు. నగరంలో చాలా భూములు.. పెద్ద సంస్థల ప్రాజెక్టులు సైతం భూ వివాదాల్లో ఇరుక్కుంటుండడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తుంటుంది. దశలవారీగా చేపట్టే ప్రాజెక్ట్‌ల్లో గృహరుణాలు పొందడం సులువు. భూమి టైటిల్‌ వంటివి క్లియర్‌గా ఉంటాయి కాబట్టి తర్వాతి దశల్లో కొనుగోలు చేసేవారు రుణాల కోసం పెద్దగా శ్రమించక్కర్లేదు.