రెరా కొత్త నిబంధనలు

రెరా కొత్త నిబంధనలు

06-08-2017

రెరా కొత్త నిబంధనలు

తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలెప్‌మెంట్ చట్టం (రెరా) 2016లో కొత్త నిబంధనలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధన వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది జనవరి 1 లేదా ఆ తర్వాత చేపట్టేందుకు అనుమతి పొందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నింటికి రెరాలోని కొత్త నిబంధనలు వర్తిస్తాయి. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కా వెంకట రెడ్డి కొత్త నిబంధనలను స్వాగతించారు.

రెరా కొత్త నిబంధనల ప్రకారం ఇళ్లను సకాలంలో అంటే షెడ్యూల్ ప్రకారం నిర్మించి ఇవ్వకపోతే రెరాకు కొనుగోలు దారులు ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే అందుకు వినియోగదారులకు బ్యాంకు చెల్లించే వడ్డీని చెల్లించాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పీలేట్ అథారిటీ ద్వారా 10 శాతం జరిమానాను ప్రాజెక్టు యజమాని వినియోగదారునికి చెల్లించాల్సి ఉంటుంది. చివరి దశలో ప్రాజెక్టు పూర్తి చేయకుండా మొండికేస్తే రెరా అథారిటీ జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా రెరా అథారిటీలోనే లభ్యమవుతుంది. ఇలా ఒక పద్ధ తిలో ప్రాజెక్టుల డాక్యుమెంటేషన్ ఉండడం వల్ల నిబంధనలను ఉల్లంఘించే ప్రసక్తి ఉండదు. ఇళ్లను కొనేవారు కూడా బిల్డర్ పరిస్థితిని అంచనా వేసుకునేందుకు రెరా అథారిటీ అవకాశం కల్పించినట్లు అయ్యింది.