ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులోకి ఆత్రేయపురం పూతరేకు

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులోకి ఆత్రేయపురం పూతరేకు

10-08-2018

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులోకి ఆత్రేయపురం పూతరేకు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో వంటకానికి పేరుందని, వాటన్నింటికీ ప్రాచుర్యం కల్పిస్తామని పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. విజయవాడలోని భవానీపురం హరిత బరం పార్కులో ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో 10.5 మీటర్ల ఆత్రేయపురం పూతరేకును తయారు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపెద్ద పూతరేకును తయారు చేయడం ద్వారా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం సంపాదించినట్లుగా వెల్లడించారు. ఏపీకి వచ్చే పర్యాటకులకు మన రుచులను పరిచయం చేస్తామన్నారు. ఏపీలోని స్టార్‌ హోటల్స్‌, హోటల్స్‌లో ఆంధ్రా వంటకాలు అందుబాటులో ఉండేలా చూస్తామని ముకేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు. సీఈవో హిమాన్షు శుక్లా మాట్లాడుతూ పూతరేకుల తయారీకి ఆత్రేయపురం ఎంతో ప్రసిద్ధి అని, తగిన ప్రాచుర్యం కల్పించేందుకు 10.5 మీటర్ల పూతరేకును అక్కడి వారితో తయారు చేయించామన్నారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థ ప్రతినిధి శాంతన్‌ చౌహాన్‌ నుంచి మీనా, శుక్లా రికార్డును అందుకున్నారు.