ఎన్నారై పెట్టుబడిదారులకు ఎపి ప్రభుత్వ రక్షణ
Sailaja Reddy Alluddu

ఎన్నారై పెట్టుబడిదారులకు ఎపి ప్రభుత్వ రక్షణ

14-09-2018

ఎన్నారై పెట్టుబడిదారులకు ఎపి ప్రభుత్వ రక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే ఎన్నారైలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు  డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో 'ఏపీ పెట్టుబడుల భద్రత, పరిరక్షణ విభాగం (ఏపీ ఇన్వెస్ట్‌మెంట్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటి సెల్‌)', ఏపీ ప్రవాస భారతీయ ఫిర్యాదుల పరిష్కార విభాగం(ఎన్‌ఆర్‌ఐ గ్రీవెన్స్‌ రెడ్రస్సెల్‌ సెల్‌)'ను ఆయన ప్రారంభించారు. ఎన్నారై సెల్‌ పనితీరుపై డీజీపీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 25 లక్షల మంది ఎన్నారైలు ఉన్నారని, వారిలో చాలా మంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ ఏదైనా పెద్దఎత్తున జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ముఖ్యమని డీజీపీ అన్నారు. ఎన్నారైలకు తగిన నమ్మకం, భద్రత కల్పించేలా సీఐడీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్టు వివరించారు. వారి ఆస్తుల రక్షణ, కిడ్నాప్‌, బెదిరింపులు, పెళ్లి వివాదాలు, ఆస్తి సమస్యలు, వీసా, సైబర్‌ క్క్రెమ్‌, ఆర్థిక నేరాలు తదితర అంశాలను ఈ ప్రత్యేక సెల్‌ పర్యవేక్షించి పరిష్కరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్‌టీ సెల్‌ ఛైర్మన్‌ వేమూరి రవికుమార్‌, ఏపీ సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్‌, శాంతిభద్రతల ఏడీజీ హరీష్‌కుమార్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.

'ఏపీ పెట్టుబడుల భద్రత, రక్షణ విభాగం' మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఏపీ సీఐడీ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సీనియర్‌ పోలీస్‌ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు, ఐటీ, ఫార్మా, పరిశ్రమల ప్రతినిధులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య సమాఖ్య (చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) ప్రతినిధులు, తెలుగు ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌టీ) ప్రతినిధులతో కూడిన సలహా మండలి ఉంటుంది. అలాగే ప్రవాస భారతీయులు రాష్ట్రంలో పెట్టుబడులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఏపీ ప్రవాస భారతీయుల ఫిర్యాదుల పరిష్కార విభాగం పనిచేస్తుంది. ఎన్నారైలకు సంబంధించిన ఏ ఫిర్యాదులైనా ఆన్‌లైన్‌ (వెబ్‌సైట్‌) ద్వారానే స్వీకరిస్తారు. 'సిఐడిఅట్‌జిమెయిల్‌ డాట్‌ కామ్‌', 9440700830 నెంబర్‌ వాట్సాప్‌, మొబైల్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు, 1800 300 26234 ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌(కాల్‌ సెంటర్‌)కు ఫిర్యాదులు చేయవచ్చు.

పెళ్ళి పేరుతో మోసం చేస్తే అంతే సంగతులు!

అమెరికా అల్లుడు వరకట్నం కోసం వేధిస్తున్నా..గృహహింసకు పాల్పడుతున్నా.. ఏపీ ఎన్‌ఆర్‌ఐ రిడ్రసల్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. భార్యను ఇక్కడ వదిలేసి విదేశాల్లో తాపీ గా ఉంటోన్న అల్లుళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఈవిభాగం పని. నమ్మక ద్రోహం తదితరాలపై బాధితులకు న్యాయం చేసేందుకు ఈవిభాగం సిద్ధం గా ఉంటుంది. వివిధ దేశాల నుంచి చేస్తోన్న ఫిర్యాదుల్లో శాంతి భద్రతలకు సంబంధించినవి రెండోస్థానం లో ఉన్నాయని ఏపీ ఎన్‌ఆర్‌టీ సీఈవో వేమూరి రవి తెలిపారు.