కొద్ది నెలల్లో రెండవ ఐటీ టవర్ రెడీ

కొద్ది నెలల్లో రెండవ ఐటీ టవర్ రెడీ

18-09-2018

కొద్ది నెలల్లో రెండవ ఐటీ టవర్ రెడీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సమీపంలో రెండవ ఐటీ టవర్‌ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సైబర్‌వాడ కేసరపల్లిలోని 'ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ' హైటెక్‌ సిటీలో ఈ రెండవ ఐటీ టవర్‌ రూపుదిద్దుకుంటోంది. మేథ టవర్‌ కంటే రెట్టింపు స్పేస్‌తో రెండవ ఐటీ టవర్‌ శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి మాసాలలోనే  ప్రారంభోత్సవం చేసుకునేందుకు వీలుగా వేగంగా పనులు జరుగుతున్నాయి. హైటెక్‌సిటీలో మొట్టమొదటి టవర్‌గా ఏర్పడిన 'మేథ' కు వెనుక భాగంలో రూ.300 కోట్ల వ్యయంతో రెండో ఐటీ టవర్‌ రూపుదిద్దుకుంటోంది. మొత్తం పార్కింగ్‌తో కలిపి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఐటీ టవర్‌ ను జీ ప్లస్‌ 6 విధానంలో నిర్మిస్తున్నారు.

హైటెక్‌ సిటీకి అభిముఖంగా జాతీయ రహదారి - 16 కు అవతల వైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల భవిష్యత్తులో ఎత్తు అవరోధంగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో భూమిలోనే జీ ప్లస్‌ 1 నిర్మాణం ఉండేలా నిర్మించటం రెండవ ఐటీ టవర్‌ నిర్మాణం ప్రత్యేకత. రెండవ ఐటీ టవర్‌ రెండు భవనాల కలబోతగా ఉంటుంది. ఒక భవనం నిర్మాణం జీ ప్లస్‌ 4 వరకు వచ్చింది. మరో భవనానికి సంబంధించి అతి కీలకమైన బేస్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు భవన నిర్మాణాలు ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండటంతో ఐటీ కంపెనీలకు స్పేస్‌ సమస్య త్వరలోనే తొలగిపోనున్నది.