ఈ ఎన్నికల్లో గెలుపు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే...

ఈ ఎన్నికల్లో గెలుపు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే...

28-11-2018

ఈ ఎన్నికల్లో గెలుపు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే...

ప్రస్తుత తెలంగాణ 2వ శాసనసభ ఎన్నికలు ఇటు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, అటు నారా చంద్రబాబు నాయుడుకు పెను సవాళ్ళుగా మారనున్నాయి. ఒకవైపు తెరాస అధినేత అధికార పీఠం చేజారి పోకుండా ఉండేందుకు అన్ని సానుకూల వనరులనూ ఉపయోగించుకోవాలని చూస్తుంటే, మరోవైపు కేసిఆర్‌ను గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆజన్మ శత్రువుతో జత కట్టి మరీ రంగంలోకి దిగారు. తెలంగాణ రాజకీయ చదరంగంలో లక్ష్య సాధనకై, అన్ని పావులనూ కదుపుతుండడంతో, ప్రస్తుత ఎన్నికలు ఇరు పార్టీలకు తాడోపేడో తేల్చుకునేవిగా ప్రతిష్టాత్మకంగా మారాయి. తాము చేసిన ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా లబ్దిదారుల ఓట్లతో సునాయాసంగా, అత్యంత సులభంగా తిరిగి అధికారం నిలబెట్టుకొన వచ్చుననే ప్రగాఢ విశ్వాసంతో, రానున్న కాలం అనుకూలంగా ఉండదేమోనన్న భావనతో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ సిద్ధపడాడ్డారు.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వక, ముందుకు దూసుకు వెళ్ళేందుకు గాను, శాసనసభ రద్దు చేసిన రోజునే 105మంది అభ్యర్థులను ప్రకటించి, విపక్షాలను రక్షణ వలయంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్‌ పాలన అంతమొందించేందుకు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం, మూడున్నర దశాబ్దాల అనంతరం, బాబు నాయకత్వంలో ఆజన్మ విరోధియైన కాంగ్రెస్‌తో రాజీ కుదుర్చుకుని, మరో రెండు పార్టీలతో కలిసి తమపై ముప్పేట దాడి చేయడానికి సిద్దమవుతుందని కేసిఆరే కాదు, తలపండిన రాజకీయ మేధావులూ కలనైనా ఊహించి ఉండకపోవచ్చు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సమీకరణను అమలు చేస్తూ, కేసిఆర్‌ను, ఆపార్టీని అధికారానికి దూరం చేయడమే ఏకైక భావ సారూప్యతతో చంద్రబాబు తీసుకున్న చొరవ కేసీఆర్‌కు ఇప్పుడు మింగుడుపడని విషయమైపోయింది.

వెండితెర వేలుపైన ఎన్టీఆర్‌కు ప్రజలలో ఇంకా ఉన్న ప్రభావం, అభిమానం, గ్రామగ్రామాన కొద్దోకొప్పో ఓట్లు కలిగిన టీడీపీ, సాంప్రదాయ ఓట్లను కలిగిన కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటై, ఓట్ల మార్పిడి జరిగితే మారనున్నవని భావించే ఫలితాలు, సాకారం కాకూడదని, గతంలో ఒకేతాను ముక్కలై, ఒకరి గురించి మరొకరికి సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్‌ కన్నా, బాబునే టార్గెట్‌గా చేసి, తెలంగాణ వ్యతిరేకిగా ప్రజలలో చెరగని ముద్ర వేయడానికి కేసిఆర్‌ ప్రచారంలో ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక టీడీపీ విషయంలో...ప్రముఖ నేతలంతా తలోదారి చూసుకుని, తెలంగాణలో నామమాత్రంగా నడుస్తున్న దుకాణం, కాస్తా, ఈ ఎన్నికలలో మూత పడడం తప్పదని భావిస్తున్న క్రమంలో, చంద్రబాబు, అనూహ్యంగా, అసాధారణమైన నిర్ణయం గైకొని, కాంగ్రెస్‌తో పొత్తుకు చేతులు చాచి, స్నేహ హస్తం అందించారు. కేసిఆర్‌ను పదవీచ్యుతిని చేయడమే లక్ష్యమంటూ, అందుకే జతకడుతున్నామంటూ ప్రకటిస్తున్న నారాబాబు, పొత్తులో తమకు కెటాయించే టిక్కెట్లపై పట్టు అసలే వద్దని, తెలంగాణ పార్టీ అనుచరులకు అనుక్షణం చెపుతూ వచ్చారు. ప్రస్తుత తెలంగాణలో జాతీయ కాంగ్రెస్‌తో పొత్తు, భవిష్యత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల మైత్రీబంధానికి భూమికగా తీసుకునేందుకు ఈ ఎన్నికలను ట్రయల్‌గా తీసుకుంటున్నారు.