ఖమ్మం సభ సక్సెస్...కూటమివైపు మొగ్గు ఉంటోందా?

ఖమ్మం సభ సక్సెస్...కూటమివైపు మొగ్గు ఉంటోందా?

28-11-2018

ఖమ్మం సభ సక్సెస్...కూటమివైపు మొగ్గు ఉంటోందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఖమ్మం ప్రచారసభ విజయవంతం కావడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని భావిస్తున్నారు. ఈ సభ సక్సెస్‌ కూటమి విజయ అంచనాలు పెంచినట్లు కూడా కనిపిస్తోంది.

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల నేతలు ఒకే వేదికపైకి రావడంతో ఆ రెండు పార్టీల నేతల్లో ఉత్సాహం పెల్లుబికింది.  రాహుల్‌, చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసి ఒకేసారి వేదికమీదకి రావడం, వేదికపై ఇద్దరూ ఎక్కువ సేపు మాట్లాడుకోవడం, ఇరు పార్టీల నేతలు వీరిద్దరినీ ప్రత్యేకంగా కలవడం, రాహుల్‌, చంద్రబాబు ప్రసంగం సమయంలో మహాకూటమికి అనుకూలంగా ప్రజలు నినాదాలు చేయడం ఆసక్తి కలిగించింది. ప్రజలు చంద్రబాబు, రాహుల్‌గాంధీలకు జేజేలు కొడుతూ కెసిఆర్‌ను, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు కేకలు వేయడం పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. నాలుగున్నరేళ్ళ తరువాత తొలిసారి ఖమ్మంకు వచ్చిన చంద్రబాబునాయుడును, తొలిసారి ఖమ్మంకు వచ్చిన రాహుల్‌గాంధీని కలిసేందుకు ఆయా పార్టీల నేతలు ఆసక్తి కనబర్చారు. ఖమ్మంలో గతంలో చంద్రబాబు సభల కంటే అధికంగా జనం రావడం, ప్రజల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించడం, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రజాకూటమి నేతలు సఫలమయ్యారు. రాహుల్‌గాంధీ, చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలగడం, ఎక్కువ సమయం ఆయనతో మాట్లాడేందుకే సమయం వెచ్చించడం ఇరు పార్టీల నేతల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా రాహుల్‌, చంద్రబాబుల సభ మహాకూటమి అభ్యర్థులకు వరంగా మారింది.

సభకు హాజరైన అభ్యర్థులంతా వారితో కలిసి ప్రజలకు అభివాదం చేయడం విశేషం. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, గద్దర్‌, మందక్రిష్ణ మాదిగా తదితరులు కూడా రాహుల్‌, చంద్రబాబులను ఆలింగనం చేసుకోవడం, తమ ప్రసంగాల్లో ఇద్దరు నేతలను పొగడటం విశేషం. వారిద్దరే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని స్పష్టం చేయడం గమనార్హం. సభలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించడం విశేషం. అలాగే మాట్లాడిన నేతలంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివద్ధి జరుగుతున్నదని, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబు అక్కడి ప్రజల సహకారంతో అప్పుల ఊబి నుంచి బయటపడుతున్నారని, కెసిఆర్‌ మాత్రం రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి మార్చారని పేర్కొన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సభకు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది హాజరై ఆసక్తిగా తిలకించడం విశేషం. కాగా చంద్రబాబు, రాహుల్‌గాంధీల సభ విజయవంతం కావడంతో రాష్టవ్య్రాప్తంగా ఇరు పార్టీల నేతలు పూర్తిగా ఐక్యంగా ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

రోడ్‌షోలకు కూడా మంచి స్పందన...

హైదరాబాద్‌ నగరంలో ప్రజాకూటమి నిర్వహించిన అమీర్‌పేట, నాంపల్లి రోడ్‌షోలు, బహిరంగ సభల్లో కూడా  కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని ప్రసంగించారు. రెండు చోట్ల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాహుల్‌, బాబు ప్రసంగాలకు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో భాజపాతో పొత్తుతో తెలుగుదేశం పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గ్రేటర్‌లో 9 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయఢంకా మోగించారు. తర్వాత రాజకీయ పరిణామాలతో అందరూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు.  జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెదేపా ఒకే ఒక కార్పొరేటర్‌ స్థానంతో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి నగరంలోని శ్రేణుల్లో తీవ్ర నిరాశ అలముకుంది. తాజా ఎన్నిల్లో కాంగ్రెస్‌, తెజస, సీపీఐతో కలిసి ప్రజాకూటమిగా ముందుకు వెళుతుండటం...ప్రత్యేకంగా చంద్రబాబు ప్రచారానికి రావడంతో ఒక్కసారిగా జోష్‌ పెరిగింది. గ్రేటర్‌ నుంచి బరిలో ఉన్న కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించడం కోసం కాంగ్రెస్‌, తెదేపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఇరువురి నేతల రాకతో ప్రజాకూటమి అభ్యర్థుల్లో గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తమవుతోంది.

Click here for Photogallery