ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ

ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ

01-05-2017

ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ

దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి దిల్లీలో ఆవిష్కరించారు. అనంతరం సంస్థ ప్రణాళికలను వెల్లడించారు. ఉత్తర భారతంలో ప్రవేశించడం ద్వారా దిల్లీ సహా చుట్టు పక్కల ప్రాంతాలకు కేవలం 5గంటల వ్యవధిలో పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హెరిటేజ్‌.. మంచి నాణ్యత కలిగిన పాలను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ముంబయి, పుణెల్లో పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ గుజరాత్‌లోనూ వ్యాపార విస్తరణకు సిద్ధమైంది. రైతుల సంక్షేమ కార్యక్రమాలను ఉత్తర భారతంలోనూ కొనసాగించనున్నట్లు నారా బ్రాహ్మణి తెలిపారు.

‘జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న హెరిటేజ్‌ సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ.6వేల కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా ప్రణాళికలు రచించింది. 2022 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాం. సాధిస్తామన్న విశ్వాసం మాకు ఉంది. డెయిరీ ఆధారిత ఉత్పత్తులపై దృష్టిపెట్టి, ప్రస్తుతం 22శాతం ఆదాయం ఆర్జిస్తున్నాం. 2022 నాటికి 40శాతం సాధిస్తాం. సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా దిల్లీ మార్కెట్‌లోనూ అడుగు పెడుతున్నాం. తాజా పాలను అందుబాటులో ఉంచడం ద్వారా దిల్లీ మార్కెట్‌లో మా ఎదుగుదలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. ఒక్క పాలు మాత్రమే కాకుండా.. పాల ఆధారిత ఉత్పత్తులూ ఉంటాయి. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో సామాజిక ఆర్థిక, పర్యావరణ విలువలను సమన్వయం చేసుకుంటాం’ అని నారా బ్రాహ్మణి తెలిపారు.