రాజధాని అభివృద్ధి భేష్... సింగపూర్ మంత్రి ప్రశంస

రాజధాని అభివృద్ధి భేష్... సింగపూర్ మంత్రి ప్రశంస

11-01-2019

రాజధాని అభివృద్ధి భేష్... సింగపూర్ మంత్రి ప్రశంస

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అతి తక్కువ సమయంలో చాలా అభివృద్ధి సాధించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అభినందించారు. ప్రభుత్వ భవన నిర్మాణ సముదాయాలను వారిద్దరూ పరిశీలించారు. 5 టవర్లుగా నిర్మిస్తున్న సచివాలయ భవనాల 2 పిల్లర్లకు వేసిన రాప్ట్‌ ఫౌండేషన్‌ను ఈశ్వరన్‌కు చంద్రబాబు చూపించారు. అంతకు ముందు చంద్రబాబుతో కలిసి రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని ఈశ్వరన్‌ సందర్శించారు. ఆర్టీజీ పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. రాజధాని పనుల వేగాన్ని చూసిన ఈశ్వరన్‌ ఆశ్చర్యపోయారని, ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయని అనుకోలేదని వ్యాఖ్యానించారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. మరోవైపు భారత్‌లోని ప్రతిభకు సింగపూర్‌ సామర్థ్యం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ఈశ్వరన్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సింగపూర్‌కు చెందిన సింక్రో స్కిల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో పెళ్లి కుమార్తెల అలంకరణ, ఫొటో గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు విజయవాడలో నిర్వహించిన పట్టభద్రుల వేడుకలో ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినుల ఫ్యాషన్‌ షో, వస్త్రాలంకరణ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.