ఏపీలో హోరెత్తిన నిరసనలు

ఏపీలో హోరెత్తిన నిరసనలు

11-02-2019

ఏపీలో హోరెత్తిన నిరసనలు

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం హోరెత్తింది. టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనకారులు ఎక్కడికక్కడ కదంతొక్కారు. వినూత్న రీతిలో ఆందోళనలు నిర్వహించారు. దున్నపోతు మెడలో మోదీ ప్లెక్సీ తగిలించి.. మోదీని ప్రధానిని చేసి తప్పు చేశామంటూ చెప్పులతో కొట్టుకుంటు, మట్టి, నీళ్లు ఉన్న కుండలు పగులకొడుతూ మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసనలు తెలిపారు. విశాఖలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నల్లచొక్కాలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. కుర్చీపై కూర్చున్న మోదీ కాళ్ల వద్ద జగన్‌, కేసీఆర్‌ జపం చేస్తున్నట్లు నిరసన తెలిపారు. ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రమణికుమారి తదితరులు ఖాళీ కుండలు ప్రదర్శించారు.

విజయవాడతోపాటు కృష్ణా, జిల్లా వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గన్నవరం వైపు నుంచి గుంటూరు సభకు వెళ్తున్న బస్సులను టీడీపీ నాయకులు గుణదల సెంటర్లో అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడిండి. ఆంధ్రరత్న భవన్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు నల్లజెండాలు, నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. నీ మట్టి, నీళ్లు, నువ్వే తీసుకుపో, మోదీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.