అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు
APEDB
Ramakrishna

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు

19-05-2017

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం పొందేందుకు అవసరమైన ప్రక్రియలన్నీ దాదాపు కొలిక్కి వచ్చాయి. వచ్చే సెప్టెంబరు -అక్టోబరు నాటికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు ప్రపంచబ్యాంకు రూ.3400 కోట్ల రుణం ఇవ్వనుంది. ప్రపంచబ్యాంకు రుణమిచ్చే ముందు నిర్వహించే పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనాలు, అభిప్రాయ సేకరణలు వంటి ప్రక్రియలన్నీ ముగిశాయి. ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచబ్యాంకు కోరిన మేరకు అవసరమైన పత్రాలన్నీ సీఆర్‌డీఏ దాదాపు అందజేసింది. ఒకటి రెండు నివేదికలు ఇవ్వాల్సి ఉందని, వాటిని త్వరలోనే అందజేస్తామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. వడ్డీ ఎంత? తిరిగి చెల్లించే ప్రక్రియ ఎప్పటినుంచి మొదలు పెట్టాలి? వంటి అంశాలపై జూన్‌లో ప్రపంచబ్యాంకుతో కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం చర్చిస్తుంది. ఆ తర్వాత బ్యాంకు పాలకమండలి సమావేశంలో రుణం మంజూరుపై నిర్ణయం తీసుకుంటారని, ఈ కసరత్తంగా ముగిసి డబ్బులు మన చేతికి వచ్చేసరికి మరో మూడు, నాలుగు నెలలు పడుతుందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.