రెండు రాష్ట్రాల ప్రజల కోరికలు నెరవేరుస్తాం

రెండు రాష్ట్రాల ప్రజల కోరికలు నెరవేరుస్తాం

13-08-2019

రెండు రాష్ట్రాల ప్రజల కోరికలు నెరవేరుస్తాం

తెలుగువారి చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, తాను సమన్వయంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు దేవుడిచ్చిన సర్వశక్తులూ ఉపయోగిస్తామని.. జగన్‌కు పెద్దన్నలా సహకారం అందిస్తానని వెల్లడించారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి గోదావరి జలాలు రావాల్సిన అసరముందని.. తప్పకుండా అది సాధ్యమవుతుందని తెలిపారు. తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదర్‌ స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగుప్రయాణంలో ఆయన చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌కు మంచి పట్టుదల ఉన్న యువనాయకుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారంతో మేం కృషి చేస్తున్నాం. ప్రజల మద్దతు ఉన్నంతకాలం తప్పకుండా రెండు రాష్ట్రాల ప్రజల కోరికలు నెరవేరుస్తాం. ఏపీకి వందశాతం నా ఆశీస్సులు, సంపూర్ణ సహకారం ఉంటాయి. నీళ్ల విషయంలో ఇప్పటికే నేను, జగన్‌ చర్చలు జరిపాం. ఇప్పుడు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఆ నీరు ప్రజలకు ఉపయోగపడాలనే నిర్ణయానికి వచ్చాం. గోదావరి జలాలలను కృష్ణానదిలో కలపాలనే విషయమై మాట్లాడుకున్నాం. రాయలసీమ ప్రజల ఇబ్బందులు నాకు తెలుసు. వారి కష్టాలు తెలిసిన నాయకుడు జగన్‌. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలవకుండా వెయ్యి టీఎంసీలను రాయలసీమకు మళ్లించాలన్నదే మా ఆశయం అని ముఖ్యమంత్రి వెల్లడించారు.