ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు : చంద్రబాబు

ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు : చంద్రబాబు

13-08-2019

ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు : చంద్రబాబు

ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని పాలక పక్షాన్ని హెచ్చరించారు. విజయవాడలో ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నామని, ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పడం లేదన్నారు. జగన్‌ పులివెందుల పంచాయితీలు రాష్ట్రంలో చేయనివ్వమని హెచ్చరించారు. బదిలీలు, ఇతర వత్తిళ్లకు లొంగి వైకాపా దాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదన్నారు. సభాపతి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. మంచి నిర్ణయాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, అందులో భాగంగానే ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతు పలికామని అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను అమలు చేస్తే ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీనిని బట్టి ఇసుక దోపిడీకి ఎవరు పాల్పడ్డారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. పేదవాడికి రూ.5 కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేశారు. అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వీటన్నిటిపైనా పోరాడేందుకు కార్యచరణ రూపొందించుకుందాం అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు