భావితరాలకు కొత్తగా వికీడేటా

భావితరాలకు కొత్తగా వికీడేటా

07-09-2017

భావితరాలకు కొత్తగా వికీడేటా

తెలుగు వికీపీడియాలో సాహిత్యం, కళలు, నాటకం, సంస్కృతి, పలువురు ప్రముఖులు వంటి అంశాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు అన్ని గ్రామాల గురించి వ్యాసాలున్నాయని, ఈ వ్యాసాల్లో చేర్చేందుకు మీమీ ఊళ్ళలో ఆలయమో, కొలనో, పర్యాటక ప్రదేశమో, ప్రధాన వీధో, ప్రభుత్వ కార్యాలయమో, బడో, ఏదోక దాన్ని స్వయంగా ఫోటో తీసి commons.wikimedia.org అన్న వెబ్సైట్‌లో చేర్చమని వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్, వికీపీడియన్ అసఫ్‌ బార్టోవ్ పిలుపునిచ్చారు.

కనీస సమాచారంతో ఉన్న ఈ గ్రామ వ్యాసాలను తెలుగు వికీపీడియన్లు, 2011, 2001 నాటి ప్రభుత్వ జనగణన (సెన్సెస్) సమాచారం సహా పలు మూలాలు ఉపయోగించి విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 299 భాషల్లోనూ, 23 భారతీయ భాషల్లోనూ వికీపీడియాలు ఉన్నాయని, వీటితోపాటు కామన్స్, విక్ష్నరీ, వికీసోర్సు వంటి సోదర ప్రాజెక్టుల అభివృద్ధి కోసం, నిర్వహణ కోసం వికీమీడియా ఫౌండేషన్ అంతర్జాతీయంగా కృషిచేస్తోందని పేర్కొన్నారు. భారతదేశ వ్యాప్తంగా కేరళ నుంచి పంజాబ్ వరకూ వివిధ ప్రదేశాల్లో వికీపీడియన్లకు సమాచార భాండాగారంగా వృద్ధి చెందుతున్న వికీడేటా మీద, సాంకేతికాంశాల మీద శిక్షణను ఇచ్చేందుకు అసఫ్‌ బార్టోవ్ ఆగస్టు 30 నుంచి దాదాపు మూడువారాల పాటు పర్యటిస్తున్నారు.

దేశంలో ఎంచుకున్న 7 నగరాల్లో హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్ వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో స్థానిక వికీపీడియన్లకు వికీడేటా, సాంకేతిక శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన, ఇతర వికీపీడియన్లు పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు వికీపీడియా నిర్వాహకుడు, సీఐఎస్-ఎ2కె సంస్థ ప్రతినిధి సూరంపూడి పవన్ సంతోష్‌ మాట్లాడుతూ తెలుగు భాష కోసం తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని భావించేవారు, ఇప్పటికే ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్‌లోనూ తెలుగు సమాచారం తోటివారితో పంచుకుంటున్నవారు తెలుగు వికీపీడియాలో కొద్ది కొద్దిగా కృషిచేయడం వల్ల భాషకి మరింత మేలుచేసినవారు అవుతారన్నారు. తెలుగు వికీపీడియా నిర్వాహకుడు, తెలుగు వికీసోర్సు అధికారి, ఎన్టీఆర్ ట్రస్టు భాషా, కళలు, సాంస్కృతిక శాఖాధిపతి రహ్మానుద్దీన్ షేక్ మాట్లాడుతూ వికీపీడియా కోసం గ్రామాల ఫోటోలు పంచుకునేప్పుడు తప్పనిసరిగా తమ స్వంత ఫోటోలనే వినియోగించాలని, అంతర్జాలంలో ఎక్కడో దొరికిన ఫోటోలతో చేయరాదని సూచించారు.

తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకుని పనిచేయడం చాలా సులభమని, ఇతర వికీపీడియన్ల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగు వికీపీడియాలో రోజుకొక వ్యాసం చొప్పున సంవత్సరం పాటు ఒక్కో వ్యాసం చేస్తూ 365 వ్యాసాలను రోజు తప్పకుండా రాసిన వికీపీడియన్ ప్రణయ్ రాజ్‌ను సముదాయ సభ్యులు అభినందించారు. ఇది ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి వికీ ఇయర్ అని పలువురు పేర్కొన్నారు. మొదట తనకు తానే 100 రోజుల పాటు రోజుకో వ్యాసం రాసే నియమాన్ని పెట్టుకుని పూర్తిచేసి, తర్వాత దాన్ని కొనసాగించారు. ఆయన 365రోజుల పాటు రోజుకో వ్యాసం రాసే ప్రయత్నం ఈరోజుతో 365 రోజుకు చేరుకోగా, ప్రణయ్ తాను ఇంతటితో ఆపనని ఈ యజ్ఞాన్ని 500 రోజులకు, వీలైతే వెయ్యిరోజులకు కొనసాగిస్తానని చెప్పారు. ప్రణయ్‌ రాజ్ ఈ క్రమంలో 100 రోజల పాటు కేవలం మహిళల గురించి, మహిళలపై వ్యాసాలు, మరో 100 రోజుల పాటు ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన వ్యాసాలు సృష్టించి విస్తరించారు. 365 రోజున ఆయన తెలంగాణ సంస్కృతి గురించి వ్యాసాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఆయనతో సముదాయ సభ్యులు కేక్ కోయించి, వేడుక చేశారు. అసఫ్‌ మాట్లాడుతూ ఆయన పెళ్ళి జరిగిన రోజున కూడా వికీపీడియాలో వ్యాసం రాసే నియమాన్ని తప్పకుండా రాయడం విశేషమని పేర్కొన్నారు.