నాలుగు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌

నాలుగు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌

13-11-2017

నాలుగు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌

ఇక దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లో పాస్‌పోర్ట్‌ చేతికందనుంది. హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం తీసుకున్న తాజా నిర్ణయంత గతంలో కన్నా ముందుగానే పాస్‌పోర్టు పొందే వీలు కలిగింది. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సాఫ్ట్‌వేర్‌ను, పోలీస్‌ వెబ్‌పోర్టల్‌కు అనుసంధానం చేసేలా నగర పోలీసులతో ఒప్పందానికి రానున్నారు. దీనితో గతంలో ఐదు రోజుల్లో అందే పాస్‌పోర్టు నాలుగు రోజుల్లోనే పొందవచ్చు. అప్లికేషన్‌ ప్రాసెస్‌, పోలీసు పరిశీలన ఒక రోజులోనే పూర్తి కానుంది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఏర్పాటు చేస్తున్న తొలి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో హైదరాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయమే.

ఈ విషయంపై హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అదికారి ఇ.విష్ణువర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్‌ అనుసంధానంతో పరిశీలన, పాస్‌పోర్టు జారీ వేగవంతమౌతాయన్నారు. ఈ విషయంపై నగర పోలీస్‌ అధికారులతో చర్చించామని, పది రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గతంలో పరిశీలన కోసం కనీసం 10 రోజులు పట్టేది. సేవా కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత వారం, ఐదు రోజులకు తగ్గిపోయింది. అయినా ప్రస్తుతం కేంద్రంలో, తిరిగి పోలీస్‌ స్టేషన్‌లో రెండుసార్లు దరఖాస్తు నింపాల్సి రావడంతో ఆలస్యమౌతుంది. ఈ రెండు సార్లు భర్తీ చేసే పరిస్థితి సాఫ్ట్‌వేర్‌ అనుసంధానంతో తప్పనుంది. దరఖాస్తులను రెండు సార్లు పూరించాల్సిన రావడంతో ఆలస్యమౌతున్నందున, ఒకే చోట పూరించే వెసులుబాటుతో మెరుగైన సేవలు అందనున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో బేగంపేట, టోలిచౌకి, అమీర్‌పేట పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తుండగా, వరంగల్‌ (హన్మకొండ), ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో వీటిని స్వీకరిస్తున్నారు. ఆదిలాబాద్‌, మెదక్‌, ఖమ్మం, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.