మహాసభలతో మరో చరిత్రకు అవకాశం
Ramakrishna

మహాసభలతో మరో చరిత్రకు అవకాశం

07-12-2017

మహాసభలతో మరో చరిత్రకు అవకాశం

తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం

తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ, ప్రపంచాన్ని తనవైపు చూసేలా కార్యక్రమాలను చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న మొదటి తెలుగు మహాసభల ద్వారా మరోచరిత్రను తెలంగాణ సృష్టించనున్నదని తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ప్రపంచ మహాసభలతో తెలుగుకు ఎనలేని మేలు జరుగుతుందనీ, ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రాచీన హోదాతో తెలుగుకు విశేష గుర్తింపు వచ్చిందని తెలంగాణలో దక్షిణాది ప్రాంతీయ భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, తద్వారా సమకూరే భారీ నిధులతో భాషాభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంతో జరిపిన సంప్రదింపుల కారణంగా రాష్ట్రానికి దక్షిణాది ప్రాంతీయ భాషా కేంద్రం మంజూరైంది. ప్రస్తుతం మైసూరులో కన్నడ, తెలుగులపై ఈ కేంద్రం ఉంది. తెలుగుకు విడిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. దీనిని హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్స్‌ గ్యాలరీలో ఏర్పాటు చేస్తాం. దీనికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. వీటితో తెలుగుభాష, లిపి, శాసనాలు, తాళపత్ర గ్రంథాలపై పరిశోధనలు చేపడతాం. మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తెస్తాం.

తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అచ్చమైన తెలుగకు మన రాష్ట్రం పుట్టినిల్లు. వాడుక భాషను అత్యంత సహజంగా మాట్లాడడం ద్వారా దానికెంతో మాధుర్యం తెచ్చింది తెలంగాణ. బాష అంటే ఇలా ఉండాలి అనిపించేలా తెలుగుకు గొప్ప పేరును మనవాళ్ళు తీసుకువచ్చారు. కానీ, వారి చరిత్ర బయటికి రాలేదు. మరోవైపు తెలుగు భాష ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు మన భాషకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. విద్య, ఉద్యోగ అవకాశాల పేరిట కొత్తతరం తల్లిభాషను నిర్లక్ష్యం చేస్తోంది. పాలనాభాషగానూ నిర్లక్ష్యానికి గురైంది.

తెలుగు ఆప్‌ వెస్ట్‌ అనాలి

తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అంటారు. దానికి కాలం చెల్లింది. ఇప్పుడంతా తెలుగు ఆఫ్‌ వెస్ట్‌ అనాలి. నిజానికి ఇటలీ భాష మాట్లాడేవారు నాలుగు కోట్ల మందే. తెలుగు మాట్లాడేవారు 15 కోట్ల మంది. మొదట్లో ఐరోపాను అనుసరించే విధానం కారణంగా ఇటలీని పోలుస్తూ ఆ నానుడి వచ్చింది. తెలుగు, ఇటలీ భాషలు రెండు అజంతాలు. అంటే అచ్చులతో ముగుస్తాయి. మాట్లాడ్డానికి ఎంతో మధురంగా ఉంటాయి.

ప్రపంచ మహాసభల కమిటీ సభ్యుల్లో ఒకరైన ఆయన మహాసభల గురించి మాట్లాడుతూ, ఈ?మహాసభలను ఇంటి పండుగలా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆతిధ్యానికి గొప్ప పేరుంది. అతిథులకు, ఆహ్వానితులకు అందుకు తగ్గట్టుగా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.