విశాఖ ఉక్కులో 10% పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం

విశాఖ ఉక్కులో 10% పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం

03-01-2018

విశాఖ ఉక్కులో 10% పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం

రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ విష్ణు దేవ సాయి జవాబు

అద్భుతమైన పనితీరుతో ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ‘నవరత్న’గా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి కారణాలేమిటి…అంటూ బుధవారం రాజ్య సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ విష్ణు దేవ సాయి జవాబిస్తూ, విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనకు 2012లోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్లో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలో 10 శాతాన్ని పబ్లిక్ ఇస్యూ (ఐపీఓ) ద్వారా విక్రయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఇక విశాఖ ఉక్కు నష్టాలకు ప్రతికూల మార్కెట్ పరిస్థితులు, ఉక్కు ఉత్పాదనల అమ్మకాలలో క్షీణత, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బొగ్గు ధరలు, అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమలో ఏర్పడిన మాంధ్యం ప్రధాన కారణాలలో కొన్ని అని మంత్రి వివరించారు. నియంత్రణ ఎత్తివేసిన రంగాలలో ఉక్కు ఉత్పాదనా రంగం ఒకటి. అందువలన ఇందులో  ప్రభుత్వం పాత్ర సంధానకర్తకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో దేశీయ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అందులో ఉక్కు వాణిజ్యానికి సంబంధించి... దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం, ఉక్కు దిగుమతులకు కనీస ధరను నిర్ణయించడం, క్వాలిటీ కంట్రోల్ చర్యల ద్వారా ఉక్కు ఉత్పాదనలు, దిగుమతులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిబంధనలు విధించడం, ప్రభుత్వం వినియోగం కోసం కొనుగోలు చేసే  ఉక్కు ఉత్పాదనలన్నింటినీ తప్పని సరిగా దేశీయ ఉక్కు పరిశ్రమల నుంచి మాత్రమే  సేకరించే విధానాన్ని ప్రకటించడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టినట్లు మంత్రి వివరించారు.