ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (బీఐఏసీహెచ్ అండ్ ఆర్ఐ)కు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. 2017 అక్టోబరులో ప్రసారమైన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఆమె పాల్గొని రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆ మొత్తాన్ని బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐకు ఇస్తున్నట్లు అప్పట్లోనే ఆమె ప్రకటించారు. ఆ మేరకు చెక్కును హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బీఐఏసీహెచ్ అండ్ ఆర్ఐ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు అందజేశారు. అంతకుముందు ఆసుపత్రి ప్రాంగణంలోని ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు బాలకృష్ణ, పీవీ సింధు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఐఏసీహెచ్ అండ్ ఆర్ఐ సభ్యుడు జేఎస్ఆర్ ప్రసాద్, పీవీ సింధు తల్లిదండ్రులు రమణ, విజయ, హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ చాముండేశ్వరీనాథ్, బసవతారకం ఆసుపత్రి సీఈవో డా.ఆర్వీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.