రివ్యూ : కళ్యాణం కమనీయం 'శ్రీనివాస కళ్యాణం'

రివ్యూ : కళ్యాణం కమనీయం 'శ్రీనివాస కళ్యాణం'

09-08-2018

రివ్యూ : కళ్యాణం కమనీయం  'శ్రీనివాస కళ్యాణం'

తెలుగుటైమ్స్ రేటింగ్ : 3/5

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

నటి నటులు : నితిన్, రాశి ఖన్నా, నందిత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, గిరి బాబు, నరేష్, జయ సుధ, ఆమని, సితార, విద్యుల్లేఖ రామన్, పూనమ్ కౌర్, హరి తేజ,ప్రవీణ్, సత్యం రాజేష్, అజయ్ తది తరులు నటించారు.

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : మధు 
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్. పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, శ్రీ మణి
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : సతీష్ వేగేశ్న 

విడుదల తేదీ :09.08.2018 

'శతమానం భవతి' సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి దిల్ రాజు నిర్మాణంలోనే శ్రీనివాస కళ్యాణం సినిమా చేశారు. శతమానం భవతి సినిమాలో కుటుంభం లోని  బంధాలు, ప్రేమల విలువలు చెప్పిన దర్శకుడు, ఈ సారి తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పెళ్లి అనేది ఓ ఈవెంట్‌లా మారిపోతున్న ఈ రోజుల్లో పెళ్లి బంధుమిత్రుల సపరివారం తో కలిసి జన్మకోసారి  జరుపుకునే పండగ అని అదో  అందమైన జ్ఞాపకం అని తెలియజేసే ప్రయత్నమే శ్రీనివాస కళ్యాణం. మరీ శ్రీనివాస కళ్యాణం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..సమీక్షలో చూద్దాం.

కథ :

శ్రీనివాస రాజు (నితిన్‌) ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కుర్రాడు. చిన్నప్పటి నుంచి తెలుగు సాంప్రదాయలు, పెళ్లి విలువ గురించి నాన్నమ్మ (జయసుధ) చెప్పిన మాటలు విని పెరిగిన శ్రీనివాస్‌ తన పెళ్లి కూడా నాన్నమ్మకు నచ్చినట్టుగా పండుగలా చేసుకోవాలనుకుంటాడు. అలాంటిది ఓ పెద్ద ఉమ్మడి కుటుంబానికి దూరంగా  చంఢీఘర్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు ఆర్కే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన ఆర్కే (ప్రకాష్ రాజ్‌) కూతురు శ్రీదేవి(రాశి ఖన్నా)తో పరిచయం అవుతుంది. శ్రీను తన ఫ్యామిలీని, సాంప్రదాయాలను గౌరవించే విధానం నచ్చిన శ్రీదేవి.. అతడితో ప్రేమలో పడుతుంది. ప్రేమా.. పెళ్లి లాంటి విషయాలను కూడా బిజినెస్‌ లా డీల్ చేసే ఆర్కే... శ్రీనివాస్‌, శ్రీదేవిల పెళ్లికి అంగీకరించాడా..? శ్రీను తన నాన్నమ్మ కోరుకున్నట్టుగా వారం రోజుల పాటు పెళ్లి వేడుకకు అందరినీ ఒప్పించగలిగాడా..? తన జీవితంలో ప్రతీ నిమిషాన్ని డబ్బుతో లెక్కించే ఆర్కే, తన పనులన్ని పక్కనపెట్టి కూతురి పెళ్లి కోసం వారం రోజులు సమయం కేటాయించాడా..?లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే... 

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

హీరో నితిన్ లుక్స్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. కుటుంబ బంధాలు సాంప్రదాయల విలువ తెలిసిన కుర్రాడిగా నితిన్‌ బరువైన పాత్రలో కనిపించాడు. తన లవర్‌ బాయ్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ఒదిగిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. పద్మావతిగా నందిత శ్వేతకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఫస్ట్‌ హాఫ్‌లో అల్లరి అమ్మాయిగా అలరించిన నందిత సెంకడ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. బిజీ బిజినెస్‌మేన్‌గా ప్రకాష్ రాజ్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, జయసుధ, సితార, విద్యుల్లేఖ రామన్‌, ప్రవీణ్ ఇలా అంతా రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు సతీష్ వేగేశ్న పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ బాంధ‌వ్యాలను, బంధువుల మధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూ సినిమాను చాలా ప్లెజెంట్‌గా తీశారు. ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద కూడా ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ముఖ్యంగా తెలుగువారి  పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో చాలా విశ్లేషాత్మకంగా చూపించినందుకు ఆయన్ని అభినందించి తీరాలి.సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. పాటల్లో తెలుగుద‌నం కనిపిస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆయన అద్భుతంగా విజువ‌లైజ్ చేసి తీశారు. ఇక మధు ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో ఆయన కత్తెరకు ఇంకొంచెం పని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని దిల్ రాజు, శిరీష్ని, లక్ష్మణ్ నిర్మాణ  విలువ‌లు చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

శతమానం భవతి సినిమాతో ఫీల్ గుడ్  ఫ్యామిలీ సినిమాకు కనెక్ట్ చేసిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న. మరోమారు ఈ దర్శకుడి నుంచి దిల్ రాజు బ్యానర్‌లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు అందుకోవటంలో ఈ సారి  కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు సతీష్ వేగేశ్న కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం సింపుల్ గా నే కథనాన్ని నడిపారు. పెళ్లి నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను మనసును తాకేలా తెరకెక్కించలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్ హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తి కరంగా అనిపించినా సెకండ్‌ హాప్‌లో లో పెళ్లి పనులు మొదలైన తరువాత కథనం మరింత నెమ్మదించింది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్‌ మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా ప్రత్యేకంగా  పెళ్లి గొప్పతనాన్ని చెప్పడానికి సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రచయితగా సతీష్ ఆకట్టుకున్నారు. పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

తీర్పు :

ఇండియన్ మూవీస్ లో ఎన్నో భాషలలో  పెళ్లి నేపథ్యంలో వచ్చిన  ఎన్నో సినిమాలు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసాయి. ఈ సారి తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేయాలనే  ప్రయత్నం తో  రాసుకున్న ఈ కథ కూడా ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మరియు గ్రామీణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ, బంధువులను వారి మధ్య అనుబంధాలను చాలా చక్కగా చూపించారు. వేసవి సెలవుల్లో జరిగే పెళ్లిళ్ల సీజన్ లో విడుదల అయ్యివుంటే  మాత్రం ఇంకా బాగుండేది. ఇప్పుడైనా ఓకే...