రివ్యూ : మైత్రి మూవీ మేకర్స్ లో మరో డిఫరెంట్ మూవీ 'సవ్యసాచి'

రివ్యూ : మైత్రి మూవీ మేకర్స్ లో మరో డిఫరెంట్ మూవీ 'సవ్యసాచి'

02-11-2018

రివ్యూ : మైత్రి మూవీ మేకర్స్ లో మరో డిఫరెంట్ మూవీ 'సవ్యసాచి'

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 3/5

బ్యానెర్లు : మైత్రి మూవీ మేకర్స్, ఎరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, షకలక శంకర్,
బ్రహ్మాజీ, నాగినీడు, దిశిత సెహగల్,  తాగుబోతు రమేష్, భరత్ రెడ్డి, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు

సంగీతం: యం.యం.కీరవాణి
పాటలు : రామ్ జోగయ్య శాస్ట్రీ, అనంత శ్రీ రామ్, సుందర రామ మూర్తి
సినిమాటోగ్రఫీ: యువరాజ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్ (CVM)
రచన, దర్శకత్వం: చందు మొండేటి

విడుదల తేదీ :02.11.2018

స్టార్ హీరోలతో ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో వరుస విజయాలతో  దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మరో డిఫరెంట్ మూవీ  ‘సవ్యసాచి’. అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా తమిళ్ హీరో మాధవన్ తెలుగు లో  నటించడం విశేషం. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే ఓ కొత్త పాయింట్‌తో రూపొందిన ఈ సినిమా ఈ రోజు  విడుదలైంది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంది? నాగచైతన్య కెరీర్‌కి ‘సవ్యసాచి’ ఎంతవరకు ప్లస్ అవుతుంది? మైత్రి మూవీ మేకర్స్ సెకండ్ హాట్ట్రిక్ కి శ్రీ కారం చుట్టిందా?  అనేది సమీక్షలో  తెలుసుకుందాం.

కథ: 

విక్రమ్‌ఆదిత్య (నాగ చైతన్య) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే డిజార్డర్‌తో పుడతాడు. ఒక బాడీలోనే ఇద్దరు కలిసి పుడతారు. అందుకే విక్రమ్, అదిత్య అనే రెండు పేర్లు అతనికి పెడతారు. విక్రమ్ ఒకటి చేయాలనుకుంటే ఎడమచేయి ద్వారా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాడు ఆదిత్య. విక్రమ్ ఆదిత్యకు తన అక్క భూమిక కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. ఆ పాపలో చనిపోయిన తన తల్లిని చూసుకుంటుంటాడు. యాడ్ ఫిలింస్ డైరెక్టర్‌గా పనిచేసే విక్రమ్‌కి ఫ్లాష్ బ్యాక్‌లో ఆరు సంవత్సరాల క్రితం ఒక లవ్‌స్టోరీ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల విక్రమ్, తన లవర్ చిత్ర (నిధి అగర్వాల్) విడిపోయి ఆరు సంవత్సరాల తర్వాత మళ్లి కలుసుకుంటారు.

లైఫ్ హ్యాపీగా గడిచిపోతున్న టైమ్‌లో ఒక ఫైర్ యాక్సిడెంట్‌లో అతని బావ చనిపోతాడు, అక్క ఆస్పత్రి పాలవుతుంది. మహాలక్ష్మి ఆ యాక్సిడెంట్ లో కాలి బూడిదైందని పోలీసులు రిపోర్ట్ ఇస్తారు. ఆ టైమ్‌లోనే అతనికి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్‌లో మహాలక్ష్మి కూడా మాట్లాడుతుంది. ఆ వ్యక్తి మాటల్ని బట్టి మహా కిడ్నాప్ అయిందని తెలుసుకుంటాడు. మహాని ఎందుకు కిడ్నాప్ చేశారు? విక్రమ్ నుంచి అతను ఆశించింది ఏమిటి? తన మేనకోడలు ఆచూకీ విక్రమ్ తెలుసుకోగలిగాడా? ఆ కిడ్నాపర్ ఆట కట్టించగలిగాడా? అనేది మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

రెండు విభిన్న మనస్తత్వాలు ఒకే మనిషిలో ఉంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎన్ని రకాల వేరియేషన్స్ అతనిలో కనిపిస్తాయి అనేది ఈ సినిమాలో నాగచైతన్యను చూస్తే తెలుస్తుంది. నాగ చైతన్య ఒకరిలో ఇద్దరిలా చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.  ఎమోషనల్ సీన్స్‌లో చైతన్య నటన మరింత ఆకట్టుకుంటుంది. అలాగే లవ్ సీన్స్‌లో, కామెడీ సన్నివేశాల్లో తనదైన నటనను ప్రదర్శించారు. ఇక డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎంతో మెచ్యూరిటీ చూపించారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నిధి అగర్వాల్ తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకుంది. తన పాత్ర పరిధి మేరకు చక్కని పెర్‌ఫార్మెన్స్‌తో అలరించింది.

తెలుగు ప్రేక్షకులకు లవర్ బాయ్ గా పరిచయం ఉన్న మాధవన్..తొలిసారి తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశారు. క్రూరమైన విలన్‌గా తన హావ భావాలతో డైలాగ్ మాడ్యులేషన్‌తో ఆడియన్స్‌లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. మాధవన్ కెరీర్‌లో ఈ క్యారెక్టర్ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, షకలక శంకర్ చాలా సందర్భాల్లో నవ్వులు పూయించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిశోర్, సత్య, షకలక శంకర్ చేసిన కామెడీ అందర్నీ నవ్విస్తుంది. విక్రమ్ అక్కగా నటించిన భూమిక ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. మిగతా నటులు తమ పాత్రల మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

దర్శకుడు చందు మొండేటి మంచి పాయింట్  తీసుకున్నాడు వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఉన్న హీరో క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించగలిగారు. హీరో తన ఎడమ చేయితో నెక్స్‌ట్ ఏం చెయ్యబోతున్నాడు అనే క్యూరియాసిటీని కలిగించడంలో చందు సక్సెస్ అయ్యారు. అలాగే విలన్ మాధవన్ క్యారెక్టర్‌ని మలిచిన తీరు, ఆయన నుంచి పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్న విధానం ప్రశంసనీయం. రిలీజ్‌కి ముందే టైటిల్ సాంగ్‌తో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచిన కీరవాణి తన పాటలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు’ పాటను మోడ్రన్‌గా రీమిక్స్ చేయడంలో కీరవాణి సక్సెస్ అయ్యారు. సినిమాలోని ప్రతి సీన్‌ని ఎలివేట్ చేసే ఆయన చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయింది.

సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. జే యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఫస్ట్‌హాఫ్‌లో ఎంతో ప్లెజెంట్‌గా సాగిపోయే కథ, కథనాలకు అతని ఫోటోగ్రఫీ చాలా ప్లస్ అయింది. నాగచైతన్యను ఎంతో క్యూట్‌గా, నిధి అగర్వాల్‌ని గ్లామర్‌గా చూపించడంలో అతని కృషి కనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ ప్రతిభ కనబరిచారు. 

కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చాలా పర్‌ఫెక్ట్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా సినిమా స్పీడ్‌గా ఉండడానికి ఆయన ఎడిటింగ్ ఒక కారణం. తమ అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో ప్రతి సినిమాకి ఒక లుక్‌ని తీసుకొచ్చే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాని కూడా ఎక్కడా రాజీపడకుండా భారీగా నిర్మించారు. ఇక డైరెక్టర్ చందు మొండేటి గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని ఒక కొత్త పాయింట్‌తో చేసిన ఎక్స్‌పెరిమెంట్  అందరికి నచ్చుతుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ: 

ఒక కొత్త పాయింట్‌తో రూపొందిన ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రేక్షకులు ఆశించే సస్పెన్స్, యాక్షన్, థ్రిల్ పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్ లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల్ని ఆహ్లాదపరుస్తుంది. సెకండాఫ్ రకరకాల ట్విస్టులతో, సస్పెన్స్‌తో కథను పరుగులు పెట్టిస్తుంది.మైనస్ విషయాలు చెప్పాల్సి వస్తే... సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. ఈ సినిమాకి నాగచైతన్య నటన, నిధి అగర్వాల్ గ్లామర్, కమెడియన్స్ చేసిన కామెడీ, మాధవన్ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్, కీరవాణి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డిఫరెంట్‌గా అనిపించే యాక్షన్స్ సీక్వెన్స్‌లు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. కొత్త తరహా కథలతో సినిమా రావాలని ఆశించే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. 

తీర్పు:

నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రానికి  దర్శకుడు మంచి వైవిధ్యమైన స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ కు తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు.  అయితే నాగ చైతన్య తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. నిధి అగర్వాల్ నటన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక వెన్నెల కిషోర్, సత్య, షకలేక శంకర్ తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. మొత్తం మీద అక్కినేని అభిమానులకు ఈ చిత్రం నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో వేచి చూద్దాం.